Talasani | ఆఖరి గొర్రె వరకు పంపిణీ చేస్తాం : మంత్రి తలసాని
Talasani విధాత : సీఎం కేసీఆర్ గొల్ల కురుమల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన గొర్రెల పంపిణీలో రెండో విడత గొర్రెల పంపిణీ ఆఖరి గొర్రె వరకు లబ్ధిదారునికి అందించేదాకా కొనసాగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ […]

Talasani
విధాత : సీఎం కేసీఆర్ గొల్ల కురుమల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన గొర్రెల పంపిణీలో రెండో విడత గొర్రెల పంపిణీ ఆఖరి గొర్రె వరకు లబ్ధిదారునికి అందించేదాకా కొనసాగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి తలసాని మాట్లాడుతూ పదివేల కోట్ల రూపాయలతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ చేపట్టారన్నారు. కరోనా తో కొంత బ్రేక్ పడిందన్నారు. మళ్లీ 1,25,000 యూనిట్ వ్యయాన్ని 1,75,000 పెంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టామన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో ఎలాంటి సందేహం అవసరం లేదని లబ్ధిదారులందరికీ గొర్రెల పంపిణీ జరుగుతుందన్నారు. ఆఖరి గొర్రె వరకు ఇచ్చే బాధ్యత నాదని, దేవుడి లాంటి సీఎం కేసీఆర్ ఉన్నారని, నిధుల కొరత లేదని, మాట ఇస్తే చేసి చూపే మహనీయుడు కేసీఆర్ అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 91 గొర్రెలు ఉన్నాయని, వాటి పిల్లలే కోటి 40 లక్షలు ఉన్నాయన్నారు. ఏ ఊరికి పోయినా కేసీఆర్ గొర్రెలు కనిపిస్తాయన్నారు. 40 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు గొర్రెల పంపిణీ, రైతుబంధు కళ్యాణ లక్ష్మి వంటి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కులవృత్తుల ప్రోత్సహించేందుకు గొర్రెల, చేపల పంపిణీ చేపట్టారన్నారు.
ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఉన్న గ్రామాలు నేడు దేశంలో తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ముందు ఎన్నడూ లేని అభివృద్ధి చేసిన చిరుమర్తి లింగయ్యను ప్రజలు గుండెల్లో పెట్టుకొని మళ్ళీ గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రాన్ని శాసించే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి లింగయ్యను మేమే గెలిపించామని చెప్పుకునేటోళ్లు వారెందుకు గెలవలేదంటూ ఏద్ధేవా చేశారు.
నల్లగొండలో ఎంతో గొప్పగా అభివృద్ధి చేసినభూపాల్ రెడ్డి కాదని ఎవడో గొట్టంగాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మళ్ళీ ఎందుకు గెలిపిస్తారంటు పరోక్షంగా విమర్శలు చేశారు. అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు మళ్ళీ గెలిపించుకుంటారన్నారు కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే మళ్లీ బంజారాహిల్స్ లోనే ఉంటారని, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతోనే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్ లో చేరారన్నారు. కొత్త జిల్లాలు మండలాలతో సీఎం కేసీఆర్ పరిపాలన ప్రజలకు మరింత దగ్గర చేశారన్నారు. అమెరికాలో వైట్ హౌస్, హైదరాబాదులో సెక్రటేరియట్ భవనం, యాదాద్రి ఆలయం రాష్ట్రానికి తలమానికంగా ఉన్నాయన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని దశాబ్ది అవతరణ ఉత్సవాల వేడుకలలో ప్రభుత్వ అధికారులతోనే ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గుజరాత్, ఆస్సాంలో బిజెపి ప్రభుత్వ పాలనలో కూడా కరెంటు కోతలు అమలు అవుతున్నాయని, రెండువేల పింఛన్ పథకం లేదని, రైతుబంధు లేదని, రైతు బీమా లేదని, గొర్రెల పంపిణీ వంటి పథకాలు లేవన్నారు.
దేశంలోనే సంక్షేమ, అభివృద్ధి రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. వ్యవసాయము సాగు తాగునీరు విద్యుత్తు వైద్యం వంటి అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. తీర ప్రాంత రాష్ట్రం ఏపీ కంటే ఎక్కువగా చేపల ఉత్పత్తి సాధించి దేశంలో నెంబర్ వన్ గా నిలిచామన్నారు.
ప్రతిపక్షాలు మాత్రం ఫెయిల్యూర్ తెలంగాణ అంటూ విమర్శించడం సిగ్గుచేటు అన్నారు దేశంలో ఆకలి దారిద్రానికి కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిపాలన శ్రీరామరక్ష అని, రానున్న ఎన్నికల్లో మరోసారి కెసిఆర్ కు అండగా నిలవాలన్నారు
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో 9,000 మంది గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. 30 లక్షల చొప్పున మండల కేంద్రాల్లో గొల్ల కురుమలకు, ముదిరాజ్, గౌడ సోదరులకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాగు తాగునీటి రంగంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పురోగమిస్తుందన్నారు.
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన తాను ప్రాణం ఉన్నంతవరకు కెసిఆర్, జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఇదే పార్టీలో కొనసాగుతానన్నారు. ప్రజాభిమానం ముఖ్యమని, ఆస్తులు ముఖ్యం కాదన్నారు. కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గంలో ముందెన్నడు లేని రీతిలో అభివృద్ధి సాధించడంతో పాటు ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని, ఆసుపత్రులు, రోడ్లు, రిజర్వాయర్లు నిర్మించుకున్నామన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది అభివృద్ధి చేసేందుకే అని, వారి కోరిన అభివృద్ధి సాధించేందుకే బిఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు.
మళ్ళీ పార్టీ మారబోనని, కేసీఅర్ చెబితే గోదావరిలోనైనా దూకుతానని, కేసీఆర్ జగదీష్ రెడ్డి నాయకత్వాన్ని నమ్ముకొని బిఆర్ఎస్ లో కొనసాగుతున్న అన్నారు. కొందరు దుర్మార్గులు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ నియోజకవర్గంలో అలజడిని సృష్టిస్తున్నారని, అలాంటి వారిని గెలిపిస్తే మళ్లీ పాత రోజులు వస్తాయన్నారు.
నర్రా రాఘవరెడ్డి మాదిరిగా తాను నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఫిష్ అండ్ గోట్ చైర్మన్ బాలరాజ్ యాదవ్ , డైయిరి కార్పొరేషన్ చైర్మన్ సామ భారత్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గన్నారు.