టార్గెట్ ఈటల.. ఈ దఫా కౌశిక్ రెడ్డికి చాన్స్!
బీసీ ఓటు బ్యాంకు లక్ష్యం మంత్రి కేటీఆర్ సంకేతం అభివృద్ధి మంత్రం ఏడ్చేవారికి అవకాశమివ్వద్దు ఈటెలకు కేటీఆర్ చురకలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున అధికార గులాబీ పార్టీ ఏ బేషజం లేకుండా తన ఆయుధాలను సన్నద్ధం చేసుకుంటుంది. కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈటల టార్గెట్గా పావులు కదుపుతున్నారు. గులాబీ నేతలు అభివృద్ధి లక్ష్యంగా ఈ సెగ్మెంట్ పైన సామూహిక రాజకీయ దండయాత్ర చేపట్టారు. తమ […]

- బీసీ ఓటు బ్యాంకు లక్ష్యం
- మంత్రి కేటీఆర్ సంకేతం
- అభివృద్ధి మంత్రం
- ఏడ్చేవారికి అవకాశమివ్వద్దు
- ఈటెలకు కేటీఆర్ చురకలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున అధికార గులాబీ పార్టీ ఏ బేషజం లేకుండా తన ఆయుధాలను సన్నద్ధం చేసుకుంటుంది. కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈటల టార్గెట్గా పావులు కదుపుతున్నారు. గులాబీ నేతలు అభివృద్ధి లక్ష్యంగా ఈ సెగ్మెంట్ పైన సామూహిక రాజకీయ దండయాత్ర చేపట్టారు.
తమ పార్టీకి ప్రత్యర్థిగా మారిన బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసే లక్ష్యంగా ప్రణాళికలు ఇప్పటినుంచే అమలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేత కేసిఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ పర్యటన ఈ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించింది.
– యాదవ్‌కు చెల్లు.. రెడ్డికే ఛాన్స్
ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు చెల్లు చీటీ పలికి రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం లభించనున్నది. మంత్రి కేటీఆర్ పరోక్షంగా జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ఈ సంకేతాలను ఇచ్చారు.
2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి అనూహ్యంగా 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి ఇచ్చి గులాబీ గూటికి చేరిన విషయం అప్పుడు తీవ్ర చర్చగా మారింది. గత ఉప ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి టికెట్ లభిస్తుందని భావించినప్పటికీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు తెరపైకి తెచ్చి ఈటలకు పోటీగా..బీసీ కార్డు ఉపయోగించాలని వేసిన ఎత్తు ఎన్నికల్లో ఫలించలేదు.
అయితే ఈసారి గెల్లు స్థానంలో మళ్లీ కౌశిక్ రెడ్డికే అవకాశాలు దక్కుతాయా? అంటే అవుననే చెప్పవచ్చు ఎందుకంటే జమ్మికుంటలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో కౌశిక్ రెడ్డికి ప్రాధాన్యతనిస్తూ ప్రసంగించడం విశేషం.
ఈ సభకు కౌశిక్ రెడ్డి అధ్యక్షత వహించారు. సభ సక్సెస్ లో జన సమీకరణలో కౌశిక్ రెడ్డి కీలక పాత్రధారి అన్నట్లు మంత్రులు ఎర్రబెల్లి, గంగుల కేటీఆర్ ప్రసంగాలలో ఈ విషయం స్పష్టమైంది.
ఇక కేటీఆర్ మాటల్లో
“నిన్న జరిగిన పొరపాటు హుజురాబాద్ గడ్డమీద మళ్ళీ జరగొద్దు… కౌశిక్ రెడ్డి నువ్వు ప్రజల్లోనే ఉండూ… ఇక్కడే ఉండూ… జనంలో ఉండూ… ఇక్కడే తినూ… ఇక్కడే పడుకో… మళ్ళీ వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటది… అంటూ ఆయనకు ఉపదేశం చేశారు. ఎన్నికల్లో నీకే అవకాశం లభిస్తుంది ముందస్తుగా పూర్వ రంగాన్ని పరిపూర్తి చేసుకోమన్నట్లు మంత్రి మాట్లాడారు”.
– నిధులకు మంత్రుల హామీ
ఇక కౌశిక్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి అడిగిన నిధులూ హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంటలో క్రీడాస్థలాల అభివృద్ధికి హామీ ఇస్తున్నట్లు చెబుతూ… మంత్రి ఎర్రబెల్లి శాఖ ద్వారా రాబోయే వందకోట్లు మాత్రమే కాదు… హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు… నూతన భవనాల నిర్మాణంతో పాటు సెగ్మెంట్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందంటూ తన లక్ష్యం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ లో తమ గెలుపుకు ఉన్న ప్రాధాన్యతను కేటీఆర్ చెప్పకుండానే చెప్పారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ, హుజురాబాద్ ఎమ్మెల్యే టార్గెట్ గా ప్రకటించారు. హుజరాబాద్ సెగ్మెంట్లో గెలు శ్రీనివాస్ యాదవ్ కు ఉప ఎన్నికల్లో లభించిన 83వేల ఓట్లను గుర్తు చేశారు.
– ఏడ్చేవారికి మళ్లీ అవకాశం ఇవ్వద్దు
అదే సమయంలో నియోజకవర్గ జనానికి కేటీఆర్ తనదైన శైలిలో విన్నవించారు.
ఉప ఎన్నికల మాదిరి ఆగం గావద్దూ… సెంటిమెంట్‌కు గురికావద్దూ… ఏడ్చే వారు వస్తారు వారిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఒక విధంగా ఈటెల గురించి ప్రస్తావించారు.
– సీటు రెడ్డికి …. ఓటు బీసీలది
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ రెండంచెల వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ కదలికలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నారు. అదే బీసీ సామాజిక వర్గ ఓట్లు లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కౌశిక్ కు అవకాశం కల్పించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
ప్రణాళికలో భాగంగానే కేటీఆర్ పర్యటన సందర్భంగా బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభం, శంకుస్థాపనలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కులాల భవనాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా బీసీల చుట్టూరని చేపడుతున్నారు. ఉప ఎన్నికల్లో ప్రయోగించిన దళిత బంధు పెద్దగా లాభం లేదని పాఠం తీసుకున్నారని అనిపిస్తోంది. అందుకే ఈసారి బీసీలు ముఖ్యంగా ఈటలకు చెందిన ముదిరాజ్ సామాజిక వర్గం పైన కేంద్రీకరణ జరుగుతోంది. కేటీఆర్ పర్యటనలో కూడా ముదిరాజుల ఇలవేల్పు పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం గమనార్ధం వీరితోపాటు గౌడులు, పద్మశాలీ లపై కేంద్రీకరిస్తున్నారు.
– ‘డబుల్’ కాంబినేషన్
ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీల తో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా క్రియాశీల పాత్ర నిర్వహిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గ రాజకీయాలతో ఉన్న సంబంధాలను బేరీజు వేసుకొని ఈటెలను ఓడించేందుకు ఈ పథకాన్ని రంగం ఎక్కించినట్లు భావించాల్సి వస్తుంది. ఈ కారణంగానే అవసరార్థం గత ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్‌ను తెరమీదకి తెచ్చినప్పటికీ ఈ దఫా ఆయనకు అవకాశం లభించకపోవచ్చని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఏవైనా పరిస్థితులు మారి అధినేత ప్రణాళికలు మారితే తప్ప తాజా సూచన ప్రకారం కౌశిక్ వైపే బిఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే బీసీ సామాజిక వర్గం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనే చర్చ జమ్మికుంట సభ అనంతరం గులాబీ శ్రేణుల్లో అప్పుడే ప్రారంభమైంది.