గ్రేటర్‌లో బీఆరెస్‌కు వరుస షాక్‌లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆరెస్ మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు

విధాత, హైదరాబాద్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆరెస్ మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ చేరికపై సంప్రదింపులు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో విబేధాల నేపథ్యంలో తీగల బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్‌లో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరిపోగా, తాజాగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. వారు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తున్నది. ఆమె సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.
అటు మాజీ మేయర్, బీఆరెస్ నేత బొంతు రామ్మోహన్ సైతం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరే విషయమై చర్చించారనే వార్తలు షికారు చేస్తున్నాయి. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి ఎంపీ టికెట్లను ఆయన ఆశిస్తున్నారు. అటు మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి సైతం తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ హామీతో పట్నం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం వినిపిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆరెస్‌కు చెందిన 20మంది కార్పొరేటర్ల వరకు హస్తం గూటికి వెళుతారన్న ప్రచారం తెరవెనుక బలంగా సాగుతున్నది.