ASSEMBLY: 6న బడ్జెట్.. 8న చర్చ
9,10,11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం: సీఎం కేసీఆర్ రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ విధాత: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగుతున్నది. ఉభయ సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి […]

- 9,10,11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ
- 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
- ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం: సీఎం కేసీఆర్
- రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి: ఎంఐఎం నేత అక్బరుద్దీన్
విధాత: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగుతున్నది. ఉభయ సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే వివేకానందగౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ బలపరిచారు. అనంతరం అన్నిపక్షాల నేతలు చర్చలో పాల్గొన్నారు.
బీఏసీ సమావేశ నిర్ణయాలను సభలో సీఎం సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 6న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 8వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనున్నదని.. వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు.
9,10,11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ, 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనున్నట్లు సీఎం తెలిపారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
మైనారిటీ, బీసీ బంధు ఉంటుందా?: అక్బరుద్దీన్
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో సగం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.
రైతుబంధు లాంటి పథకాలు ఉన్నా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? తలసరి ఆదాయం చెబుతున్నారు.. తలసరి అప్పు ఎంత? మైనారిటీ, బీసీ బంధు వస్తుందా? ఉద్యోగుల డీఏ, వేతన సవరణ ఎప్పుడు? వంటి ప్రశ్నలను సంధించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై చర్చ జరగాలి, పోరాడాలన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.