కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడి

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేయనున్న 36లోక్‌సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తొలి జాబితాకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది

  • By: Somu    latest    Mar 08, 2024 12:41 PM IST
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడి
  • తెలంగాణలో 4ఎంపీ సీట్ల అభ్యర్థుల ఎంపికకు ఆమోదం

విధాత : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేయనున్న 36లోక్‌సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తొలి జాబితాకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. అందులో తెలంగాణ నుంచి 17ఎంపీ స్థానాలకు గాను కేవలం 4స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపికకు ఆమోదం తెలిపింది. జహీరాబాద్ అభ్యర్థిగా సురేశ్ షేట్కర్, చేవెళ్లకు సునీతా మహేందర్ రెడ్డి, నల్లగొండకు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది. అంతకుముందే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును ప్రకటించారు.

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాందీ, రాహుల్ గాంధీ(వర్చువల్‌గా హాజరు), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ, దిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీతో పాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్ ,ఆధీరంజన్ చౌదరి,అంబికాసోనిలు పాల్గొన్నారు. తొలి జాబితాలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు సంబంధించి కనీసం తొమ్మిది స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తారని భావించారు. అందుకు భిన్నంగా కేవలం నాలుగు స్థానాల పేర్లకే ఆమోదం తెలపడం చర్చనీయాంశమైంది.