గవర్నర్‌ తమిళిసై ట్వీటర్‌ ఖాతా హ్యాకింగ్‌పై పురోగతి

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ట్విటర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ విచారణపై అధికారులు కీలక పురోగతి సాధించారు. ముంబై నుంచే గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌ ’ ఖాతా హ్యాక్‌ అయినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు

గవర్నర్‌ తమిళిసై ట్వీటర్‌ ఖాతా హ్యాకింగ్‌పై పురోగతి

విధాత : తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ట్విటర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ విచారణపై అధికారులు కీలక పురోగతి సాధించారు. ముంబై నుంచే గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌ ’ ఖాతా హ్యాక్‌ అయినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. అక్కడి ఓ బొటెక్‌ వైఫై‌ నెట్‌వర్క్‌‌ను దుండగుడు వినియోగించినట్టు సాంకేతిక ఆధారాల ద్వారా కనిపెట్టారు. బొటిక్ సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించగా వివరాలు తెలియవని చెప్పినట్టుగా సమాచారం. దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బోటిక్ షాప్ మూసి వేసే ఉంది.


గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎక్స్ అకౌంట్ ఈ నెల 14న హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోతాజాగా మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల ద్వారా వివరాలు పంపాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. అలా అందిన సమాచారంతో ముంబై నుంచి ఖాతాను హ్యాక్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల గవర్నర్‌ తమిళి సైతో పాటు బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవిత, మంత్రి దామోదరం రాజనరసింహ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ల ట్విటర్‌ అకౌంట్లు కూడా హ్యాక్‌ అయినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి.