పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ.. ఇక సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ!

విధాత : తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (Potti Sriramulu Telugu University )పేరు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మారింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశ పెట్టారు. బిల్లును అసెంబ్లీ అమోదించింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాతా రెండు రాష్ట్రాలలో ఒకే పేరుతో ఉన్న యూనివర్సిటీల పేర్లను మార్చుకున్నామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటైన హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుకున్నామన్నారు. అలాగే ప్రొఫైసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ యూనివర్సిటీ, పీవీ నరసింహరావు వెటర్నటీ యూనివర్సిటీలు ఇప్పటికే పేరుమార్పులతో కొనసాగుతున్నాయన్నారు.
ఏపీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కొనసాగుతున్నందున.. తెలంగాణోలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి (Suravaram Pratap Reddy Telugu University)యూనివర్సిటీగా నామకరణం చేశామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు, ఇతర ఉద్దేశాలు లేవన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ, ఏపీపీఎస్సీ వంటివి ఏపీలో ఉండటంతో ఇక్కడ టీజీఆర్టీసీ, టీజీపీఎస్సీ పేర్లతో ఏర్పాటు చేశామన్న సంగతిని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలలో ఒకే పేరుతో యూనివర్సిటీలు, రాష్ట్ర సంస్థలు ఉండటం పరిపాలనలో, ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయని అందుకే వాటి పేర్లు మార్చడం జరిగిందని స్పష్టం చేశారు.
పొట్టి శ్రీరాములు పట్ల మా ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు. చర్లపల్లి టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరును తాను కేంద్రానికి ప్రతిపాదిస్తున్నానన్నారు. బల్కం పేట నేచర్ క్యూర్ హస్పిటల్ కు దివంగత సీఎం రోశయ్య పేరును ప్రతిపాదిస్తున్నానన్నారు. అయితే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించగా, ఇతర పక్షాలు మద్ధతు తెలిపాయి.