Telangana Secretariat | నూతన సచివాలయం.. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

Telangana Secretariat విధాత‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు (ఆదివారం) జరిగేఈ ప్రారంభోత్సవానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచివాలయం తూర్పు భాగంలో సుదర్శన యాగం నిర్వహణకు హోమగుండం నిర్మించారు. ప్రధాన ద్వారం ద్వారా వచ్చే వాహనాల నంబర్లను గుర్తించి తెరుచుకునే విధంగా స్పెన్సర్‌ బారియర్లను ఏర్పాటు చేశారు. వీటి పనితీరును నిన్న ఉన్నతాధికారులు పరిశీలించారు. సచివాలయ‌నికి ఉత్తరం మూలన నిర్మించిన భద్రతా టవర్‌పై సిబ్బంది నిరంతర నిఘా ఉంటుంది. […]

Telangana Secretariat | నూతన సచివాలయం.. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

Telangana Secretariat

విధాత‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు (ఆదివారం) జరిగేఈ ప్రారంభోత్సవానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచివాలయం తూర్పు భాగంలో సుదర్శన యాగం నిర్వహణకు హోమగుండం నిర్మించారు. ప్రధాన ద్వారం ద్వారా వచ్చే వాహనాల నంబర్లను గుర్తించి తెరుచుకునే విధంగా స్పెన్సర్‌ బారియర్లను ఏర్పాటు చేశారు.

వీటి పనితీరును నిన్న ఉన్నతాధికారులు పరిశీలించారు. సచివాలయ‌నికి ఉత్తరం మూలన నిర్మించిన భద్రతా టవర్‌పై సిబ్బంది నిరంతర నిఘా ఉంటుంది. ఉత్తరంవైపు సిబ్బంది పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. వెనుకభాగంలో చర్చి, పక్కనే మసీదు, నైరుతి మూలన గుడిని నిర్మిస్తున్నారు. ప్రధాన ద్వార మార్గాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం కేటాయించారు. బాంబ్‌ స్క్వాడ్‌ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది.

దేదీప్యమానంగా నూతన సచివాలయం

నూతన సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమైంది. మొత్తం నిర్మాణం విస్తీరణం 10,51,676 చదరపు అడుగులు. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. 11 అంతస్తుల ఎత్తులో నిర్మాణమైనా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానున్నది. సీఎం కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరంలో ఆరో అంతస్తులోనే ఏర్పాటైంది. సీఎం ఛాంబర్‌కు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉన్నాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్‌ సదుపాయం ఉన్నది.

సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్‌ తదితరాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. 7నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు. రాజ్‌పత్‌ తరహాలో ఫౌంటేన్‌లు, అత్యాధునిక సౌకర్యాలతో నూతన సచివాలయం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది.

పలు సంక్షేమ పథకాల ప్రతిపాదనలపై సీఎం సంతకం

సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు వెలువరించనున్నది. ఆయా వర్గాలకు మేలు చేసే పలు ప్రతిపాదనల దస్త్రాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేయనున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డైట్‌ ఛార్జీల పెంపు దస్త్రం పై సీఎం సంతకం చేయనున్నారు. సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగేలా డైట్‌ ఛార్జీలు 25 శాతం పెంచాలని మంత్రుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించింది.

దళితబంధు పథకం రెండో విడత విధివిధానాలూ సీఎం ఆమోదించనున్నారు. నియోజకవర్గానికి 1500 మందికి చొప్పున పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్‌లో రూ. 17 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. వివిధ వర్గాలకు విదేశీ విద్యాపథకం కింద నిధులు మంజూరు చేయనున్నారు.

పేదల కోసం గతంలో సమీకరించిన స్థలాలు పంపిణీ చేయడానికి, హైదరాబాద్‌ లో నోటరీ భూముల క్రమబద్ధీకరణకు విధి విధానాలపై సీఎం సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.అలాగే గృహలక్ష్మి పథకం విధివిధానాల రూపకల్పనకు సీఎం ఆదేశాలు జారీచేయనున్నారు.