స్పేస్ స్టేష‌న్‌ను పేల్చేసుకున్న తయారీ సంస్థ‌.. కార‌ణం ఏమిటంటే..

అమెరికాలో ప్ర‌సిద్ధ ఏరోస్పేస్ సంస్థ సియారా స్పేస్.. తాను రూపొందించిన అంత‌రిక్ష కేంద్రం ప్రొటోటైప్ మోడ‌ల్‌ను పేల్చేసింది.

స్పేస్ స్టేష‌న్‌ను పేల్చేసుకున్న తయారీ సంస్థ‌.. కార‌ణం ఏమిటంటే..

అమెరికా (America) లో ప్ర‌సిద్ధ ఏరోస్పేస్ సంస్థ సియారా స్పేస్ (Sierra Space) .. తాను రూపొందించిన అంత‌రిక్ష కేంద్రం ప్రొటోటైప్ మోడ‌ల్‌ను పేల్చేసింది. 2030 క‌ల్లా స్పేస్ స్టేష‌న్‌ను అంత‌రిక్షంలోకి పంపాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్న ఈ సంస్థ తాజా చ‌ర్య చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ పేలుడు చ‌ర్య‌ను అల‌బామాలోని నాసాకు చెందిన మార్ష‌ల్ స్పేస్ సెంట‌ర్‌లో నిర్వ‌హించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్ని చిన్ని మొత్తాల‌లో ఒత్తిడిని క‌లిగించి మాడ్యుల్ సామ‌ర్థ్యంపై ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించ‌గా..ఇప్పుడు దాని సామ‌ర్థ్యానికి మించి ఒత్తిడిని ఇచ్చి పేలిపోయేలా చేశారు. ఈ మొత్తం వీడియోను సియారా స్పేస్ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.


నాసా మాడ్యుల్‌పై ప‌డే గ‌రిష్ఠ ఒత్తిడిని నాసా (NASA) 60.8 పీఎస్ఐగా నిర్ధారించ‌గా.. ఈ పరిశోధ‌న కోసం 77 పీఎస్ఐ ఒత్తిడిని స్పేస్ స్టేష‌న్‌పై ప్ర‌యోగించ‌డంతో అది బుడ‌గలా పేలిపోయింది. ఈ చర్య‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే చేశామ‌ని.. కొన్ని ర‌కాల వివ‌రాల‌ను తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించామ‌ని సియ‌రా స్పేస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా అత్యాధునిక సాంకేతిక‌త‌తో త‌యారుచేసిన స్పేస్ సెంట‌ర్‌ను సియ‌రా స్పేస్‌, బ్లూ ఆరిజ‌న్ సంస్థ‌లు సంయుక్తంగా 2030 త‌ర్వాత అంత‌రిక్షంలోకి యోగించుకున్నాయి. ఆర్బిటల్ రీఫ్ స్పేస్ స్టేష‌న్ పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నాయి.


ప్ర‌స్తుతం ఉన్న అంత‌రిక్ష కేంద్రం జీవిత‌కాలం ముగియ‌నుండ‌టంతో.. నాసా కొత్త కేంద్రం కోసం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులో కూడా భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టింది. ఒక మ‌ధ్య‌స్థాయి కుటుంబానికి కావాల్సిన ఇల్లు ప‌రిమాణంలో త‌మ స్పేస్ స్టేష‌న్ ఉంటుంద‌ని సియ‌రా స్పేస్ వెల్ల‌డించింది. 20.5 మీట‌ర్ల‌తో మూడు అంత‌స్తుల ఎత్తున‌.. ఈ నిర్మాణం ఉండ‌నుంది. ఫ్లెక్సిబిలిటీ కోణంలో సాంకేతిక‌త‌ను వినియోగించ‌డంతో దీనిని ఎప్ప‌టి క‌ప్పుడు అంత‌రిక్షంలోనే విస్త‌రించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. విభిన్నమైన రాకెట్‌లను దీనికి అనుసంధానించే విధంగానూ రూపొందిస్తున్నారు.