No-Confidence | మోదీపై అవిశ్వాసం?.. తీర్మానం ప్రతిపాదించనున్న ‘ఇండియా’!
No-Confidence బిల్లులు ఆమోదించుకునే యత్నాల్లో కేంద్రం మోదీ నోరు తెరిపించేందుకు విపక్షాల ప్లాన్ తటస్థ పార్టీల వైఖరీ వెల్లడయ్యే అవకాశం న్యూఢిల్లీ: మణిపూర్‌పై చర్చ జరగకుండా చూసి, తన బిల్లులు ఆమోదించుకునే ప్రయత్నాల్లో కేంద్రం ఉన్న నేపథ్యంలో మోదీ సర్కారుపై పలు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. విపక్షాల కూటమి ‘ఇండియా’లో భాగస్వాములుగా ఉన్న కొన్ని పార్టీలు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఇదే వాస్తవరూపం దాల్చితే.. కచ్చితంగా […]

No-Confidence
- బిల్లులు ఆమోదించుకునే యత్నాల్లో కేంద్రం
- మోదీ నోరు తెరిపించేందుకు విపక్షాల ప్లాన్
- తటస్థ పార్టీల వైఖరీ వెల్లడయ్యే అవకాశం
న్యూఢిల్లీ: మణిపూర్‌పై చర్చ జరగకుండా చూసి, తన బిల్లులు ఆమోదించుకునే ప్రయత్నాల్లో కేంద్రం ఉన్న నేపథ్యంలో మోదీ సర్కారుపై పలు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. విపక్షాల కూటమి ‘ఇండియా’లో భాగస్వాములుగా ఉన్న కొన్ని పార్టీలు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఇదే వాస్తవరూపం దాల్చితే.. కచ్చితంగా ఈ చర్చకు మోదీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అదే సమయంలో అటు ఎన్డీయేలో, ఇటు ఇండియాలో చేరకుండా తటస్థంగా ఉన్న పార్టీల వైఖరి కూడా తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచీ మణిపూర్‌లో హింస అంశంపై తీవ్రవాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉభయ సభలు తరచూ వాయిదా పడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న బిల్లుల ఆమోదం విషయంలో ముందడుగు పడటం లేదు.
అయితే.. ఈ పరిస్థితికి చెక్ పెట్టి.. బిల్లులు ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ పేరుతో మణిపూర్ హింసపై చర్చను మొత్తానికి పక్కనపెట్టే ప్రయత్నాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపిస్తున్న పలువురు ప్రతిపక్ష నేతలు.. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం ఉదయం నిర్వహించిన ఐఎన్‌డీఐఏ కూటమి సమావేశంలో ఈ మేరకు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.
మణిపూర్ హింసపై ప్రధాని స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేసేందుకు మరిన్ని మార్గాల్లో ఒత్తిడి చేయాలని నిర్ణయించిన ‘ఇండియా’.. ఈ క్రమంలో మణిపూర్‌పై ప్రభుత్వం చర్చ చేపట్టేందుకు అవిశ్వాస తీర్మానం కూడా ఒక సమర్థవంతమైన మార్గం అవుతుందని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అదే సమయంలో రాజ్యసభలో కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయని సమాచారం.
ప్రతిపక్షాలు పట్టు వీడవు : బీజేపీ
మణిపూర్ విషయంలో ప్రధాని ముందుగా ఉభయసభల్లో ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు.. తమ డిమాండ్ నుంచి వెనక్కు తగ్గే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పని తాను చేసుకుపోవాలని నిర్ణయించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ సైతం ఈ విషయంలో స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సభ్యుల అరుపులు, కేకల మధ్యే బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించుకోవాలనే వ్యూహంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు.
బిల్లుల ఆమోదంలో ప్రభుత్వం
ఒకవైపు లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండగానే.. మరోవైపు అధికార పక్షం తన పని తాను చేసుకుపోయింది. బయోలాజికల్ డైవర్సిటీ (సవరణ) బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నది. అంతకు ముందు ఉదయం సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచీ విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నినాదాలు ఆపి, సభ నడిచేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినా.. సభ్యులు తమ డిమాండ్‌పై తగ్గలేదు. నినాదాలతో సమస్యలు పరిష్కారం కావన్న స్పీకర్.. ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికీ గొడవ సద్దుమణగలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ అదే దృశ్యం
రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగిన సభ్యులనుద్దేశించి రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాలు అనేది ప్రభుత్వ జవాబుదారీ తనానికి, పారదర్శకతను కోరుతుందని, మొత్తంగా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తుందని చెప్పారు. అందుకే ప్రశ్నోత్తరాలు అనేది పార్లమెంటరీ పనిలో గుండెకాయలాంటిదని అన్నారు. సభ్యులు సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. కానీ.. ఉభయ సభల్లో ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఒకవైపు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నా.. సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ్యులెవరూ ఎలాంటి ప్రశ్నలు వేయలేకపోయారు.