కొనుగోళ్లే.. టికెట్ రాని నేత‌లే టార్గెట్‌

  • By: Somu    latest    Sep 25, 2023 11:15 AM IST
కొనుగోళ్లే.. టికెట్ రాని నేత‌లే టార్గెట్‌
  • ప‌ద‌వుల ఆశ‌, న‌గ‌దు పంపిణీ
  • జ‌నాదర‌ణ‌ను బ‌ట్టి రేటింగ్‌
  • రూ.5 నుంచి 10 కోట్ల వ‌ర‌కు బేరం
  • ఇత‌ర ఖ‌ర్చులు అదనం
  • రంగంలోకి బీఆరెస్‌, బీజేపీ, కాంగ్రెస్‌
  • ప్ర‌త్యేక బడ్జెట్ కేటాయింపు


విధాత‌, హైద‌రాబాద్‌: గెలుపే ప‌ర‌మావ‌ధిగా రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెట్టాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయ‌కులు, ఇత‌ర బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డాయి. ఇందు కోసం ప‌ద‌వులు, డ‌బ్బులు ఎర వేస్తున్నాయి. ఏ నాయ‌కుడికి, కార్య‌క‌ర్త‌కు ఏది అవ‌స‌ర‌మో అది నెర‌వేరుస్తామంటూ ఆయా పార్టీల అగ్ర‌నాయ‌కులు హామీలిస్తూ త‌మ పార్టీ జెండాలు క‌ప్పేస్తున్నారు.


మ‌రోవైపు అధికార పార్టీ ఒక్క అడుగు ముందుకేసి త‌మ పార్టీలోని అసంతృప్త నేత‌లు పార్టీ మార‌కుండా ఉండేందుకు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మంత్రి ప‌ద‌వులు, కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఎర‌వేసింది. ఏ నాయ‌కుడికి ఏది కావాలంటే అది అవ‌స‌ర‌మైతే కొండ‌మీది కోతినైనా తెచ్చి ఇచ్చే ప‌నిలో ప‌డింద‌ని ఆ పార్టీకి చెందిన ఒక నేత అన్నారు.


ప్ర‌త్య‌ర్థి పార్టీకి ప్ర‌చారం చేయ‌డానికి నాయకుడనే వాడు లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యంగా ఆయా పార్టీలు ప‌ని చేస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని నాయ‌కుల‌ను కొనుగోళ్లు చేయ‌డానికే భారీ ఎత్తున బ‌డ్జెట్ కేటాయించుకున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. అధికార పార్టీ నేత‌ల కొనుగోళ్ల‌కే రూ.3 వేల‌ కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ద‌మైన‌ట్లు టాక్‌.


ఇదే తీరుగా బీజేపీ కూడా భారీ ఎత్తున నిధుల ప్ర‌వాహం కురిపించ‌డానికి సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. ఈ సారి తెలంగాణ ఎన్నిక‌ల కోస‌మే వేల కోట్లు ప్ర‌త్యేకంగా కేటాయించార‌న్న చ‌ర్చ రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో జ‌రుగుతోంది. ఇది ఇలాఉండ‌గా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాల‌న్న దృఢ నిశ్చ‌యంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా భారీగానే ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ధమైన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో టాక్‌.


ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు నాయ‌కులు లేకుండా…


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన బీఆరెస్ అధికారాన్ని శాశ్వ‌తంగా అనుభ‌వించాల‌న్న ఆశ‌తో ఉన్నది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ రాష్ట్రంలో త‌మ‌కు ప్ర‌తిప‌క్షం అనేది లేకుండా చేయాల‌న్న దిశ‌గా పావులు క‌దిపింది. మొద‌ట టీడీపీపై కన్నేసి, మొత్తం టీడీఎల్‌పీనే విలీనం చేసుకొన్న‌ది. దీంతో రాష్ట్రంలో టీడీపీ నామ‌మాత్ర‌పు పార్టీగా మిగిలింది. 2018 ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీపై దృష్టి కేంద్రీక‌రించింది.


కాంగ్రెస్‌కి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేల‌ను తీసుకొని సీఎల్‌పీని విలీనం చేసుకున్న‌ది. దీంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోయింది. పార్టీలోకి తీసుకున్న కాంగ్రెస్ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు, ఇత‌ర కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు కొంతమంది లాభం లేద‌ని భావించి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌న్న చ‌ర్చ అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రిగింది.


కెర‌టంలా ఎగిసిన‌…


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌ని భావిస్తున్న త‌రుణంలో కెర‌టంలా ఎగిసింది. ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగింది. పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. అధికార పార్టీ వైఫ‌ల్యాల‌నే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్‌లో రాహుల్ గాంధీ స‌భ పెట్టి ధ‌ర‌ణి ర‌ద్ధు చేస్తాన‌ని ప్ర‌క‌టించింది.


వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ మొద‌లు తుక్కుగూడ స‌భ వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. బీఆరెస్‌కు స‌వాల్ విసిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి తెలంగాణ‌లో అధికారాన్ని చేప‌ట్టాల‌న్న దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తోంది. బీఆరెస్ లో బ‌ల‌మైన నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న‌ది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిన త‌రువాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, రేఖానాయ‌క్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిట్టా బాల‌కృష్ణారెడ్డి, యెన్నం శ్రీ‌నివాస్‌రెడ్డి లాంటి కీల‌క‌మైన నేత‌లు బీఆరెస్‌, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు.


ఒకరిద్ద‌రు నేత‌లు నేడో, రేపో అధికారికంగా పార్టీలో చేర‌నున్నారు. ఇలా బ‌ల‌మైన నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న‌ది. అధికార బీఆరెస్‌, బీజేపీ పార్టీల‌లోని బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకునే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. టికెట్లు ఇవ్వ‌లేని వారికి పార్టీ అధికారంలోకి రాగానే ప‌ద‌వులు ఇస్తామ‌ని చెపుతుంది. ఈ సారి త‌ప్ప‌కుండా కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని, స‌ర్వేలన్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని చెప్పి ఒప్పిస్తోంది. ఇదే స‌మ‌యంలో అధికార బీఆరెస్ అంత కాక‌పోయినా భారీగా ఖ‌ర్చు చేయ‌డానికి కాంగ్రెస్ సిద్ధమైన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


ప‌ద‌వులు-డ‌బ్బులు


నామ‌మాత్రపు పార్టీగా మిగులుతుంద‌నుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క‌సారిగా బ‌ల‌మైన పార్టీగా లేచి నిల‌బ‌డ‌డంతో బీఆరెస్ అగ్ర నేత‌లను క‌లవ‌ర ప‌రుస్తోంది. పైగా ప‌లు స‌ర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వ‌స్తుంద‌న్న ఫ‌లితాలు రావ‌డాన్ని బీఆరెస్ జీర్ణించుకోలేక పోతోంది. ఎలాగైనా కాంగ్రెస్ ఎదుగుద‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్న కృత నిశ్చ‌యంతో కేసీఆర్ ఉన్నారు.


ఇందులో భాగంగా త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ లీడ‌ర్ల‌ను పార్టీలోకి చేర్చుకోవాల‌ని నాయ‌కుల‌కు ఆదేశాలిచ్చాడు. ఎమ్మెల్యే అభ్య‌ర్థులు కాకుండా ఇత‌ర నాయ‌కులంద‌రినీ పార్టీలో చేర్చుకోవాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని నాయ‌కులు, కాస్త బ‌లం, ఓటు బ్యాంకున్న నాయ‌కుల‌ను కొనుగోళ్లు చేయ‌డానికి సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది.


ఈ మేర‌కు ప‌ద‌వులు కావాల‌నుకున్న వారికి ప‌ద‌వులు ఇస్తామ‌ని, అలాగే అవ‌స‌రాల‌కు డ‌బ్బులు కూడా ఇస్తున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇలా ఇత‌ర పార్టీలోని బ‌ల‌మైన నాయ‌కుల కొనుగోళ్ల‌కు భారీ ఎత్తున నిధులు స‌మ‌కూర్చార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఒక్కో నాయ‌కుడికి జ‌నంలో ఉండే ప‌లుకుబ‌డి ఆధారంగా ప‌దవులతో పాటు రూ. 5 నుంచి 10 కోట్ల వ‌ర‌కు బేరం చేస్తున్న‌ట్లు స‌మాచారం.


వీటితో పాటు ఆ నాయ‌కుడి అనుచ‌రుల కోసం, ఇత‌ర సౌక‌ర్యాల కోసం అద‌నంగా ఇస్తామ‌ని మాటిస్తున్న‌ట్లు తెలిసింది. ఇలా ఒక్కో నియోజ‌కవ‌ర్గంలో ఇత‌ర పార్టీ నాయ‌కుల కోసం దాదాపు రూ.50 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు. తాజాగా పార్టీలోకి చేరుతున్న ఏపూరి సోమ‌న్న‌కు సాంస్కృతిక స‌మితి చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


టికెట్లు రాని నేత‌ల‌కు ప‌ద‌వుల పందేరం


బీఆరెస్ ఇత‌ర పార్టీ నేత‌ల‌కు వ‌లేయ‌డ‌మే కాకుండా సొంత పార్టీ నేత‌లు వ‌ల‌స పోకుండా క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, జీహెచ్ఎంసీ ప‌రిధిలో జ‌రిగిన న‌ష్టం మ‌రో చోట జ‌రగ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా టికెట్ రాని నేత‌ల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా బుజ్జ‌గింపులు చేస్తూ ప‌ద‌వుల ఎర వేస్తోంది.


కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి పార్టీ మార‌తార‌ని టాక్ వ‌చ్చింది. వెంట‌నే అల‌ర్ట్ అయిన కేసీఆర్ రంగంలోకి దిగి మ‌హేంద‌ర్‌రెడ్డికి మంత్రి ప‌దవి ఇచ్చారు. ఇదే తీరుగా టికెట్ ద‌క్క‌ని స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు రైతు బంధు స‌మితి అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తాన‌ని ఒప్పించాడు. అలాగే జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌న్నారు. ఇలా అసంతృప్త నేత‌లు పార్టీ మార‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.


శ‌క్తి చాటాల‌ని..


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైన త‌మ శ‌క్తి చాటాల‌న్న ల‌క్ష్యంతో ఉన్న‌ది. ఇందు కోసం కాంగ్రెస్‌లోని కీల‌క‌మైన నేత‌ల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని ప్లాన్ వేసింది. అయితే లిక్క‌ర్ స్కామ్ కేసు విచార‌ణ తీరుపై సందేహాలు వ్య‌క్తం కావ‌డంతో బీఆరెస్‌, బీజేపీ ఒక్క‌టేన‌న్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా ప‌డి పోయింది. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీ వైపు చూసిన బీఆరెస్ అసంతృప్త నేత‌లు కాంగ్రెస్‌లో చేరారు.


దీంతో ఉన్న మేర‌కు పార్టీని ఎలాగైనా కాపాడుకోవాల‌న్న ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్న‌ది. ఇందులో భాగంగా బీజేపీ ప్ర‌ధాని మోడీ చేత రాష్ట్ర ప‌ర్య‌ట‌న చేయిస్తోంది. అలాగే డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డానికి కూడా ఏమాత్రం వెనుకాడ కూడ‌ద‌న్న నిర్ణ‌యంతో బీజేపీ నేత‌లున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని నాయ‌కుల‌ను కొనుగోళ్లు చేయ‌డానికి సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బేర‌సారాలు భారీఎత్తున జ‌రుగుతున్నాయ‌న్న సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి.