మీకు పింఛనా?.. మాకు కొలువా?
నిధులు, నీళ్లు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్ నినాదాలతో సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థుల పాత్ర ఎనలేనిది.

- మాకు ఉద్యోగాలొస్తే నాలిగింతల పింఛన్ మేమే ఇస్తం
- పింఛన్‌కు ఆశపడి.. ఓట్లేయకండి
- మాకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని
- మీకు పెన్షన్లతో సరిపెడుతున్నారు
- వృద్ధులకు వివరిస్తున్న యువత
- పార్టీల పింఛన్ ఓట్ల ఆశలపై నీళ్లు
- ఎన్నికల వేళ హడావుడి నోటిఫికేషన్లు
- పరీక్షల నిర్వహణలోనూ అవకతవకలు
- తప్పలు తడకగా మారిన టీఎస్పీఎస్సీ
- కసిమీదున్న నిరుద్యోగులు, యువత
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: నిధులు, నీళ్లు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్ నినాదాలతో సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థుల పాత్ర ఎనలేనిది. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సమయంలో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ ఖమ్మం దవాఖానలో పండ్లరసం తీసుకుని దీక్ష విరమించారన్న వార్తలు పొక్కడంతో ఉస్మానియా రణరంగమైంది.
రాష్ట్రంలో అగ్గిరాజుకున్నది. ఒక విధంగా కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగించడానికి విద్యార్థులే కారణమయ్యారన్న చర్చ అప్పట్లో సాగింది. మొత్తానికి కేసీఆర్ కొనసాగించిన దీక్ష కారణంగా డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. తదుపరి కూడా ఆ ప్రకటనను అమలు చేయని క్రమంలో పెల్లుబికిన పోరాటంలో యువత తమ ఉజ్వల భవిష్యత్తు పణంగా పెట్టి, ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు.
రాష్ట్రం సాకారమైనా.. గత పదేళ్ల పాలనలో నియామకాలు మరుగునపడిపోవడంతో యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నది. దీంతో ఇప్పటికే పలు యువజన సంఘాలు గ్రామాల్లో తిరుగుతూ.. తమకు ఉద్యోగం వస్తే 40వేల పైనే జీతం వస్తుందని, అందులోంచి తామే పదివేలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తూ.. పెన్షన్ల పేరుతో అధికార పార్టీ మోసం చేస్తున్నదని వివరిస్తూ వృద్ధులను చైతన్యంపర్చే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. పింఛన్ల రూపంలో కొంత పడేస్తూ మభ్యపెడుతున్నదని వివరిస్తున్నారు.
ఆయా కుటుంబాల్లో ఉంటున్న నిరుద్యోగ మనుమలు, మనుమరాళ్లు కూడా ఇదే విషయాన్ని ఇంట్లోని వృద్ధులకు వివరించి చెబుతున్నారు. పెద్ద ఎత్తున జీతాలు ఇవ్వాల్సి వచ్చే కొలువుల అంశాన్ని పక్కనపడేసి.. కొద్దిపాటి పెన్షన్ విదుల్చుతూ ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయని నచ్చజెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆరెస్‌కు ఓటేయబోమంటూ వారితో ఒట్టు వేయించుకుంటున్నారు. నెలకో రెండు వేలు చేతికి అందుతున్నాయని మురిసిపోయే వృద్ధులు.. ఆ పేరుతో తమ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తున్నారు. తాము ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తామని మాటిస్తున్నారు.
గత ఎన్నికల్లో పక్క రాష్ట్రంలో జాబు రావాలంటే.. బాబు రావాలి.. అనే నినాదంతో టీడీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. తెలంగాణలో మాత్రం బీఆరెస్ గెలుపులో వృద్ధాప్య పింఛన్లు కీలక పాత్ర పోషించాయి. తమ నాయనమ్మలకు, అమ్మమ్మలకు, తాతలకు నాలుగు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో తాము ఆ రోజు వ్యతిరేకించలేదని పలువురు యువకులు చెబుతున్నారు. కానీ.. రెండో దఫాలో సైతం నిరుద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో యువత కసిమీద ఉన్నట్టు కనిపిస్తున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆరెస్‌కు ఓటు వేయొద్దని తెగేసి చెబుతున్నారని సమాచారం. ‘నీకు బీఆరెస్ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులు కావాలా? నాకు ఉద్యోగం రావాలా? నువ్వే ఆలోచించుకో’ అని ఇంట్లో వృద్ధులకు చెబుతున్నారని తెలుస్తున్నది. ఉద్యోగం లేకపోవడం వల్లే తనకు ఇంత వరకూ పెళ్లి కాలేదని వివరించి చెబుతున్నారు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటానని మీకు మాటిచ్చానని ఆ మాట నెరవేరాలంటే ఈ ప్రభుత్వం మారాల్సిందేనని నచ్చచెబుతున్నారు. తనకు ఉద్యోగం వస్తే నెలకు 40 నుండి 50 వేల జీతం వస్తుందని, తానే అందులో నుంచి ఐదు నుంచి పదివేలు పంపిస్తానని వృద్ధులైన నాయనమ్మ, తాతలకు విడమర్చి చెబుతున్నారు. నాకు పెళ్లయి, భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండటం ముఖ్యమా? లేక నీకు రెండువేల పింఛన్ ముఖ్యమా? ఉద్యోగం లేక నేను పిచ్చివాడిగా తిరగడం ముఖ్యమా? నువ్వు పెన్షన్‌తో బతకడం ఇష్టమా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం జీతాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుందని కొలువులు భర్తీ చేయడం లేదని, అందుకే వృద్ధులకు పింఛన్ల వల విసిరి.. వారి ఓట్లతో రెండు దఫాలుగా గెలుస్తూ వచ్చిందని, మూడోసారి కూడా అదే పన్నాగంలో ఉన్నదని వివరిస్తున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ల విషయంలో ఒక దారుణమైన ప్రచారానికి దిగిందని, పెద్ద కొడుకులా కేసీఆర్ పింఛన్ ఇస్తున్నాడు అనే వాదాన్ని బలంగా తీసుకెళ్లిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధులు ఇటువంటి ప్రచారాన్ని ఇట్టే నమ్మేస్తారని, తన పెద్ద కొడుకు కేసీఆర్ అని భావించి ఓట్లు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇటువంటి వారి విషయంలో కూడా నిరుద్యోగులు అప్రమత్తంగా ఉంటున్నట్టు సమాచారం. అటువంటివారితో ఏకంగా ఒట్టు వేయించుకుంటున్నారని గ్రామాల్లో సంభాషణల ద్వారా తెలుస్తున్నది.
కేసీఆర్ పిలుపుతో ఉద్యమంలోకి యువత
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్రేకపూరిత, ఉత్తేజభరిత ఉపన్యాసాలతో వేల మంది యువత రాష్ట్ర సాధన సమరంలో దూకారు. ఆ క్రమంలో ఆవేశానికి లోనై.. అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాము తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయినా తమ చెల్లెళ్లు, తమ్ముళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పొంది, ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని ఆశించిన మృత్యువును సైతం ముద్దాడు. కానీ.. వారి ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
సీఎం వైఖరితో అపనమ్మకంలో నిరుద్యోగులు
తొలి ఐదేళ్లలో అనేక అంశాలను చక్కదిద్దాల్సి ఉన్నదని కేసీఆర్, ఇతర మంత్రులు చెబుతున్న మాటలను విద్యార్థులు, నిరుద్యోగ యువత నమ్ముతూ వచ్చారు. రెండో దఫాలోనైనా తమ కలలు నెరవేరుతాయని ఆశించి మళ్లీ బీఆరెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ.. రెండో దఫాలో కూడా కొలువులు దక్కకపోగా.. టీఎస్పీఎస్సీ తప్పుల కుప్పగా తయారవడం, ప్రశ్న పత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పదే పదే వాయిదాలతో యువత విసుగెత్తి పోయింది.
ఈ సంవత్సరం ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఆరు నెలల ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా యువతను, నిరుద్యోగులను ఆకర్షించవచ్చని బీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ.. వాటికి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాలులీక్ కావడంతో 30 లక్షల మంది నిరుద్యోగులు హతాశులయ్యారు. పేపర్ లీకేజీపై తప్పును గుర్తించి, బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఏ రాష్ట్రంలో ఎన్నిసార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్పించి.. ఆత్మ విమర్శ చేసుకోలేక పోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
నాడు కాంట్రాక్ట్ పద్ధతి వద్దని..
ఈ పదేళ్ల కాలంలో నిరుద్యోగుల సమస్యపై ఏనాడూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలో కాంట్రాక్టు అనే పదమే ఉండకూడదని చెప్పిన నాటి ఉద్యమ నేత.. నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంట్రాక్టీకరణ పెంచేశారని వారు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు ధారబోసి, పుస్తకాలతో కుస్తీ పడితే పేపర్ లీకేజీలతో నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడుతున్నారు. ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంది. దానిపై కూడా ప్రభుత్వం అనైతికంగా రాజకీయం చేసిందని యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నది.
ఉద్యోగ భర్తీల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో భర్తీ చేసిన కొన్ని సింగరేణి ఉద్యోగ నియామకాల్లో అధికార పార్టీకి చెందిన కీలక నేత ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకు ముందే పరీక్షలు రాయించారని వార్తలు వచ్చినా.. విచారణకు ఆదేశించిన పాపానపోలేదని నిరుద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటి ప్రభావం రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యువత, నిరుద్యోగులు తాము ఉద్యోగాలు రాక పడుతున్న ఇబ్బందులను తమ ఇంట్లోని పెద్దలకు చెప్పి, వారిని ఒప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వార్నీ.. ‘కంటి వెలుగు’ వెనుక ఇంత పథకమా?
గ్రామాల్లో కంటిచూపు మందగించినవారి సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. అటువంటివారికి ప్రభుత్వం కంటివెలుగు పథకం పేరుతో పెద్ద ఎత్తున కంటి అద్దాలు పంపిణీ చేసింది. అవసరం ఉన్నకొందరికి కంటి ఆపరేషన్లు చేయించింది. అయితే.. ఎంత మందికి ఆపరేషన్లు జరిగాయన్న విషయంలో తగిన లెక్కలు లేవు. అయితే.. ఈ కంటి వెలుగు పథకం వెనుక పెద్ద కథే ఉన్నదని గ్రామాల్లో చర్చలు, సంభాషణల సందర్భంగా పలువురు పేర్కొనడం ఆసక్తి రేపుతున్నది. అదే.. ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తించగలగడం. చపాతీ రోలర్, రోడ్డు రోలర్, కెమెరా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు తదితర గుర్తులు బీఆరెస్ కారు గుర్తును పోలి ఉంటాయి. కొన్నిచోట్ల బీఆరెస్ మెజార్టీకి దీటుగా సదరు గుర్తులకు ఓట్లు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
దీంతో బీఆరెస్ కొట్లాడి మరీ వీటిని తొలగింపచేసింది. అయితే వృద్ధుల్లో ఈ గుర్తుల విషయంలో ఇబ్బంది లేకుండా, అవి స్పష్టంగా కనిపించేలా చూసేందుకే యుద్ధ ప్రాతిపదికన కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. పింఛన్ల కారణంగా వృద్ధుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని నమ్మకంతో ఉన్న ప్రభుత్వం.. గుర్తుల విషయంలో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాలని భావించే కళ్లద్దాలు పంపిణీ చేసినట్టు ఉన్నదని చర్చించుకుంటున్నారు. అంటే వృద్ధుల ఓట్లపై అధికార పార్టీ ఎంత గట్టినమ్మకంతో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.