అంతటా ప్రలోభాల మయం.. జోరుగా డబ్బులు..మద్యం పంపిణీ
విజయం కోసం నిన్నటిదాకా ప్రచార పర్వంలో పోటీ పడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ పోటీ పడటంతో పట్టణాలు.. గ్రామాలు తేడా లేకుండా డబ్బు, మద్యం పంపిణీ ప్రవాహంలా సాగింది.

- పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ పోటాపోటీ
- నగదు అందని చోట మా సంగతేమిటంటూ రగడ
విధాత : విజయం కోసం నిన్నటిదాకా ప్రచార పర్వంలో పోటీ పడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ పోటీ పడటంతో పట్టణాలు..గ్రామాలు తేడా లేకుండా డబ్బు, మద్యం పంపిణీ ప్రవాహంలా సాగింది. నిన్నటిదాకా ఎన్నికల హామీలతో, కులాల వారిగా, బూత్‌లు, వార్డుల వారిగా నిత్య విందులతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించిన అభ్యర్థులు పోలింగ్‌కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నంగా విచ్చల విడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. ప్రలోభాల కట్టడిలో ఎన్నికల సంఘం నిఘా బృందాలు నామమాత్ర పాత్రకే పరిమితమయ్యాయి.
అయితే ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడంలో సహజంగానే అధికార బీఆరెస్ పార్టీ అధికారుల, పోలీసుల సహకారం నేపధ్యంలో మిగతా పార్టీల వారికంటే పైచేయి చాటారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అంతా తమ శక్తి మేరకు ఓటుకు ఇంత మొత్తం అని 1000రూపాయల చొప్పున నుంచి 5వేల వరకు పంపిణీ చేశారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో, పోటీ సులభంగా ఉన్న నియోజకవర్గాల్లో కనీసం 1000 నుంచి 2వేల చొప్పున పంపిణీ చేయగా, పోటీ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో, పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో ఓటుకు 5వేల వరకు పంచారు. అభ్యర్థుల అనుచర గణం పోలింగ్ రోజు తెల్లవారే వరకు కూడా ఇంటింటికి తిరిగి డబ్బుల పంపిణీని రహస్యంగా నిర్వహించే ప్రకియ సాగించారు.
పలుచోట్ల ఇప్పటికే ఒక విడతలో కొందరు అభ్యర్థులు నగదు పంపిణీ చేశారు. అయితే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థి తన కంటే అధికంగా డబ్బు పంపిణీ చేసినట్లు తెలిసిన వెంటనే మరో విడత నగదు పంపిణీకి సైతం అభ్యర్థులు వెనుకాడలేదు. నగదుతో పాటు బూత్‌లు, వార్డుల వారిగా, కాలనీలు, అపార్ట్‌మెంట్‌ల వారిగా మద్యం పంపిణీని చేపట్టి ప్రతి ఇంటికి మద్యం అందేలా ప్రయత్నించారు. కొందరు అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బుల పంపిణీ సందర్భంగా ఓటర్లతో తమకే ఓటు వేస్తామని దేవుళ్ల మీద ప్రమాణాలు సైతం చేయించుకుని మరి నగదు పంపిణీ చేశారు. హైద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ సాగించారు.
సికింద్రాబాద్, ముషిరాబాద్, సనత్ నగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లిహీల్స్, పటాన్ చెరు, మేడ్చల్, మల్కాజిగిరి, ఎల్భీనగర్ వంటి గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రాలు, కార్పోరేషన్లు ఉన్న నియోజకవర్గాల్లో ఓటు రేటు అధికంగా పలికినట్లుగా సమాచారం. ఓటర్లకు డబ్బుల పంపిణీలో భాగంగా కొన్ని చోట్ల తమకు అభ్యర్థుల నుంచి డబ్బులు అందలేదంటూ స్థానిక నేతలతో ఓటర్లు గొడవ పడటం కూడా చోటుచేసుకుంది. అనుచరుల చేతివాటం లేక పంచడానికి అనుకూలత లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు అందని చోట ఈ రకమైన వాగ్వివాదాలు రేగాయి. ములుగు జిల్లా ఏటూరి నాగారంలో తమకు డబ్బులు రాలేదంటూ గ్రామస్తులు పలువురు నాయకులపై తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
సిక్రెట్ డంప్‌లతో నగదు పంపిణీ
ఓటర్లకు నగదు పంపిణీలో అభ్యర్థులు తనిఖీ బృందాలకు, ప్రత్యర్థి పార్టీల వారికి చిక్కకుండా పలుచోట్ల రహస్య ప్రాంతాల్లో ముందుగానే డబ్బులను, నగదును డంప్ చేశారు. అక్కడి నుంచి నిర్ధేశించుకున్న అనుచరులు, కార్యకర్తల ద్వారా నగదు పంపిణీ సాగించారు. రహస్య డంప్‌లుగా కోళ్ల ఫారాలను, విద్యాసంస్థలను, పారిశ్రామిక వాడలను, రైస్ మిల్లులను, కాలనీలు, అపార్ట్‌మెంట్‌లను, పార్కింగ్ వాహనాలను, అంబులెన్స్‌లు, కంకర మిషన్లను కూడా వినియోగించారు. ఎల్‌బీ నగర్ వంటి చోట్ల ఓ ప్రధాన పార్టీ అభ్యర్ధి ఓటర్ల ఫోన్లకు మెసెజ్‌ల ద్వారా ఫలానా కిరాణం షాపుకు వెళితే మెసేజ్‌లో ఉన్న సరుకులను ఇస్తారని సందేశం ఇచ్చి, సరుకులతో పాటు అందులో దాచిన నగదు కవర్ ఓటర్‌కు చేర్చిన తీరు నగదు పంపిణీ ఎత్తుగడలకు నిదర్శనంగా నిలిచింది.
వలస ఓటర్లకు ఖర్చుల పంపిణీ
ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైంది కావడంతో వలస ఓటర్లను ఆకర్షించడంలో అభ్యర్థులు పోటీ పడ్డారు. వలస ఓటర్లకు ఓటుకు ఇంత అని ఇచ్చే నగదుతో పాటు వారు ఓటు వేసేందుకు రానుపోను దారి ఖర్చులకు కూడా డబ్బులు పంపిణీ చేశారు. వలసలో భాగంగా ఒకే చోట ఎక్కువ మంది పనిచేస్తే అటువంటి ఓటర్ల వద్దకు అభ్యర్థులే వాహన వసతి కల్పిస్తున్నారు. మరోవైపు ఓటు వేసేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు గురువారం జంట నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు గ్రామాలకు చేరుతుండటంతో గురువారం రోజంతా జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.
ఇప్పటికే 730కోట్ల పట్టివేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటిదాకా నిర్వహించిన తనిఖీల్లో 730కోట్ల మేరకు నగదు పట్టుబడింది. అదిగాక 126కోట్ల మద్యం, 40కోట్ల డ్రగ్స్, 186కోట్ల మెటల్స్, 85కోట్ల ఉచిత బహుమతులను అధికారులు సజీచ్ చేశారు. పోలింగ్‌కు ముందు రెండు రోజుల్లో 40కోట్ల మేరకు నగదు పట్టుబడింది.