ఆందోళ‌న‌లో అధ్య‌క్షులు!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అధికార పార్టీ సహా మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో లోలోన గుబులు రేపుతూనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆందోళ‌న‌లో అధ్య‌క్షులు!
  • గెలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా బీఆరెస్‌..
  • బొటాబొటీ మెజార్టీతో కాంగ్రెస్‌కు దినదినగండం
  • కాంగ్రెస్‌ గుంజుకునే ప్రమాదంపై బీజేపీ టెన్షన్‌
  • మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు
  • లోక్‌సభ ఎన్నిక‌ల దాక ఢోకా ఉండ‌ద‌న్న ధీమా
  • 15 మంది ట‌చ్‌లో ఉన్నార‌న్న మ‌ధు యాష్కీ
  • 55 మంది ఉన్నామని అసెంబ్లీలో కేటీఆర్‌ వ్యాఖ్య
  • సర్కారు కూలిపోవడంపై మొదట్లోనే బీజేపీ కామెంట్‌
  • పైకి గంభీర ప్ర‌క‌ట‌న‌లు.. లోలోన అప‌న‌మ్మ‌కం!


విధాత‌, హైద‌రాబాద్‌: బొటాబొటీ మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అధికార పార్టీ సహా మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో లోలోన గుబులు రేపుతూనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూడు పార్టీల అధ్యక్షులూ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై ఓ కన్నేసి ఉంచారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆరెస్‌ ప్రలోభపెడితే.. మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.


గతంలో బీఆరెస్‌ ప్రవచించిన ‘నియోజకవర్గ అభివృద్ధి కోసం’ అనే మంత్రాన్ని కాంగ్రెస్‌ పఠించి.. బీఆరెస్‌నే చీల్చితే అధికార పార్టీ పటిష్టంగా తయారవుతుంది. ఆ స్థితిలో బీజేపీపైనా కన్నేసే అవకాశాలు ఉంటాయి. లేదు.. బీజేపీ, బీఆరెస్‌ కలిసి కాంగ్రెస్‌పై దృష్టిసారిస్తే రేవంత్‌ సర్కారుకు మూడినట్టే! ఇటువంటి పరిస్థితుల్లో 15 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత మధుయాష్కి గౌడ్‌ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.


‘నియోజకవర్గం అభివృద్ధి కోసం’ అనే వాదనతో 2014 త‌రువాత తెలంగాణలో ఫిరాయింపుల ప‌ర్వం ఊపందుకున్న‌ సంగతి తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టిన బీఆరెస్ వ‌రుస‌గా రెండు ట‌ర్మ్‌లు పాలించింది. మొద‌టిసారి గెలిచిన త‌రువాత టీడీపీ ఎమ్మెల్యేల‌ను టోకున పార్టీలో చేర్చుకొని టీడీఎల్‌పీని బీఆరెస్ ఎల్‌పీలో విలీనం చేసుకున్న‌ది. దీంతో రాష్ట్రంలో టీడీపీ నామమాత్రంగా త‌యారైంది.


మిగిలిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు టీడీపీలో కొన‌సాగలేక కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి 2018 ఎన్నిక‌ల త‌రువాత బీఆరెస్.. కాంగ్రెస్ పార్టీపై కేంద్రీక‌రించింది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలను బీఆరెస్‌లో చేర్చుకొని సీఎల్‌పీని కూడా విలీనం చేసుకున్న‌ది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్ర‌ధాన పోటీదారుగా ఉండ‌కూడ‌ద‌న్న నిర్ణయంతో బీఆరెస్ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిందనే విమర్శలు వ్యక్తమైనా.. రాజకీయ పునరేకీకరణ పేరుతో బీఆరెస్‌ నేతలు సమర్థించుకున్నారు.


పుంజుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌


ప‌డి లేచిన కెర‌టంలా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని తాజా ఎన్నిక‌ల్లో 64 సీట్లు సంపాదించుకొని అధికారం చేప‌ట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం బీఆరెస్‌కు సుతారమూ ఇష్టం లేదని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్‌.. తన మిత్రపక్షం, తన మిత్రపక్షంగా నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించిన బీజేపీ సభ్యులను కలుపుకొని ‘ఇటువైపు 54 మంది ఉన్నాం’ అని చెప్పడం కలకలం రేపింది. ప్ర‌భుత్వానికి బొటాబొటి మెజార్టీ మాత్ర‌మే ఉంది.. అవ‌స‌ర‌మైతే అటు నుంచి ఇటు గుంజుకొని ప్ర‌భుత్వాన్ని కూల‌గొడ‌తామ‌న్న హింట్ ఇచ్చార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.


మేకపోతు గాంభీర్యమా?


ఒక వైపు బీఆరెస్ పైకి అలా మాట్లాడుతున్నా.. మ‌రో వైపు త‌మ పార్టీ నుంచి గెలిచిన 39 మంది స‌భ్యులు జారిపోకుండా చూసుకోవాలనే ఆందోళన ఆ పార్టీకి ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్ప‌టికే బీఆరెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు దాదాపు 15 మంది కాంగ్రెస్ పార్టీకి ట‌చ్‌లో ఉన్నార‌న్న‌ చ‌ర్చ జ‌రుగుతోంది. అది నిజమేనని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కి చెప్పారు.


బీఆరెస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని, అయితే పార్టీ ఇమేజ్ దెబ్బ‌తింటుంద‌ని వ‌ద్ద‌ని చెబుతున్నామని ఆయన తెలిపారు. ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జంప్ కావ‌డానికి సిద్ధంగా ఉన్నారని నేరుగానే చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు బీఆరెస్ నేత‌ల‌కు నిద్రను దూరం చేసేవేనని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు.


బీజేపీలోనూ గుబులే


బీజేపీలో ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేద‌ని అంటున్నారు. అయితే కేంద్రంలో త‌మ పార్టీనే అధికారంలో ఉంది కాబ‌ట్టి, గ‌తంలో క‌ర్ణాట‌క‌, మ‌ధ్యప్ర‌దేశ్‌ మాదిరిగా కాంగ్రెస్, బీఆరెస్ ఎమ్మెల్యేల‌ను గుంజుకుని తామే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఈ మేర‌కు ఈ మధ్య కాలంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. అయితే బీజేపీ నుంచి కూడా త‌మ పార్టీలోకి నేత‌లు వ‌స్తార‌ని మ‌ధుయాష్కీ కామెంట్ చేయడం ఆసక్తి రేపుతున్నది.


ముఖ్యంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల లోపు సోయం బాపురావుతోపాటు చాలా మంది బీజేపీ నేత‌లు త‌మ పార్టీలో చేరి పోటీ చేస్తార‌న్నారు. ఇలా కాంగ్రెస్‌, బీఆరెస్‌, బీజేపీ నేత‌లు ఎవ‌రికి వారు ఇత‌ర పార్టీల నుంచి త‌మ పార్టీలోకి వ‌స్తారంటూ గంభీర‌మైన ప్ర‌క‌ట‌లు చేస్తూ, మైండ్ గేమ్ ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదంతా కూడా లోలోన ఆందోళ‌న చెందుతూ త‌మ పార్టీల‌కు చెందిన ఇత‌ర పార్టీల వైపు వెళ్ల‌కుండా కాపాడుకునే ప్ర‌య‌త్నాల్లో భాగమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


లోక్‌సభ ఎన్నికల వరకూ ఢోకాలేదు


పార్లమెంటు ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ పార్టీ కూడా ఫిరాయింపులను ఇప్పటికిప్పుడు ప్రోత్సహించే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. లోక్‌సభ ఎన్నికల్లో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే.. పార్లమెంటు ఎన్నికల ఫలితాల ఆధారంగా రాజకీయ పునరేకీకరణకు అవకాశం లేకపోలేదని, అందులోనూ కాంగ్రెస్‌ అధిక స్థానాలు సాధిస్తే.. ఇతర పార్టీల నేతలు అధికార పార్టీవైపే దృష్టిసారించేందుకు అవకాశాలు ఉన్నయన్న చర్చ నడుస్తున్నది.