స్టేషన్ ‘మాస్టర్’ కోసం టగ్గాఫ్ వార్.. రాజయ్య, శ్రీహరి మధ్య కిరికిరి!
ఇద్దరి మధ్య ఐక్యత మున్నాల్ల ముచ్చట ఆత్మీయ సమ్మేళనాలతో మళ్లీ చిచ్చు పేరుకే ఒక పార్టీ పరస్పరం విమర్శలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్న నాయకులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పేరుకే వారిద్దరూ ఒకే పార్టీ. ఒకరికొకరు ప్రత్యర్ధుల కన్నా ఎక్కువ. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. వాస్తవానికి ఒకప్పుడు ఇద్దరు వైరి శిబిరాల ప్రతినిధులుగా ఉన్నారు. వారు ఎవరంటే ఒకరు స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, మరొకరు […]

- ఇద్దరి మధ్య ఐక్యత మున్నాల్ల ముచ్చట
- ఆత్మీయ సమ్మేళనాలతో మళ్లీ చిచ్చు
- పేరుకే ఒక పార్టీ పరస్పరం విమర్శలు
- ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్న నాయకులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పేరుకే వారిద్దరూ ఒకే పార్టీ. ఒకరికొకరు ప్రత్యర్ధుల కన్నా ఎక్కువ. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. వాస్తవానికి ఒకప్పుడు ఇద్దరు వైరి శిబిరాల ప్రతినిధులుగా ఉన్నారు. వారు ఎవరంటే ఒకరు స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, మరొకరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇద్దరూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లక్ష్యంగా రాజకీయ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఉండడం కంటే పరస్పరం విమర్శలు ఎక్కువ పెట్టుకోవడమే ఎక్కువ సందర్భాలుగా సాగుతున్నాయి.
ఐక్యత మున్నాళ్ల ముచ్చట
ఇటీవల స్టేషన్గన్పూర్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందు పరస్పరం విమర్శలు చేసుకున్నప్పటికీ, సభ కోసం కలిసిపోయారు. ఈ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత పరిస్థితి మళ్లీ యధాస్థితికి చేరింది. ఇటీవల రాజయ్య పై ఓ మహిళా సర్పంచి లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీని వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందని ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కడియం ను ఉద్దేశించి అని భావించారు.
ఆత్మీయ సమ్మేళనాలతో చిచ్చు
తాజాగా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టేషన్గన్పూర్ లో కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమ్మేళనాలు మళ్లీ విభేదాలకు తెరతీశాయి. కడియం మరోసారి బహిరంగంగా రాజయ్య పై మీడియా సమావేశంలో విరుచుకపడ్డారు.
అధిష్టానం ఆదేశాలు బేఖాతర్: కడియం
సీఎం ఆదేశాలు స్థానిక నాయకత్వం భేఖాతరు చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం హాట్ కామెంట్స్ చేశారు. సీఎం ఆదేశాలు స్థానిక నాయకత్వం భేఖాతరు చేస్తున్నదని విమర్శించారు. తనకు నియోజకవర్గంలో నిర్వహించే ఆత్మీయ సమావేశాల సమాచారం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రాజయ్య పై కడియం అసహనం తెలియజేశారు. సభలు, సమావేశాలు జరిగినప్పుడు సాయం అడుగుతున్నారు, ఆ తర్వాత విస్మరిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికలల్లో నిస్వార్థంగా పనిచేసినా, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు పిలువడం లేదన్నారు. కాగా, ఈ ఆరోపణలకు రాజయ్య ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి.
పేరుకే ఒక పార్టీ.. పరస్పరం విమర్శలు
రాజయ్య, శ్రీహరి ఇద్దరు నాయకులు ప్రస్తుతం గులాబీ గూటిలో ఉన్నప్పటికీ, ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత దూరం. చిత్రం ఏమిటంటే ఇద్దరూ గత టర్ములో మాజీ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మరో ప్రత్యేకత. వారిద్దరూ వచ్చే ఎన్నికల్లో స్టేషన్ మాస్టర్ గిరి దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఎత్తుకు పై ఎత్తులు
సెగ్మెంట్లో పట్టు కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో పరస్పరం పరోక్షంగా, ఒక్కో సందర్భంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించు కుంటున్నారు. నియోజకవర్గంలో సభ, సమావేశం జరిగితే ఒకరిని విమర్శించకుండా మరొకరు ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే ఒకరు డాక్టర్, అయితే మరొకరు పూర్వాశ్రమంలో లెక్చరర్ గా పనిచేశారు. కాకుంటే ఇందులో ఒకరు క్లాస్ అయితే మరొకరు మాస్ గా పేరు పొందారు.
గతంలో వైరి శిబిరాలు
గతంలో కడియం, తాటికొండ వీరిద్దరూ ప్రత్యర్థి రాజకీయ పార్టీలలో కొనసాగారు. ఒకరిపై ఒకరు పోటీ చేసి గెలుపోటములు చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ లో చేరారు. తర్వాత టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గులాబీ గూటికి చేరారు. ఆ తర్వాత రాజయ్య ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేసి గెలిచి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కడియం వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి భర్త రఫ్ చేసి అనూహ్యంగా కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఆయనను ఎంపీగా రాజీనామా చేయించి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆ తదుపరి రాజయ్య 2018లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కడియం కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకుండా మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
అయితే ఇరువురి రాజకీయ క్షేత్రం ఒకే నియోజకవర్గం కావడంతో అక్కడే కేంద్రీకరించి పనిచేస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఇరువురు పోటీకి సై అంటే సై అంటున్నారు. ఈ కారణంగా ఒకరు మరొకరికి అవకాశం చిక్కకుండా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పరస్పర విమర్శలకు దారితీస్తోంది. గులాబీ పార్టీ అధిష్టానం కూడా వీలైనంత మేరకు విభేదాలను పెంచి పోషిస్తుందని విమర్శలు ఉన్నాయి.