బీహార్‌ను మరిపిస్తున్న ఖమ్మం పరిస్థితులు: మాజీ మంత్రి తుమ్మల
ఖమ్మం కంటే బీహార్ నయం అనేలా బీఆరెస్ పాలనలో పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు

విధాత : ఖమ్మం కంటే బీహార్ నయం అనేలా బీఆరెస్ పాలనలో పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. గురువారం 39వ డివిజన్ రోడ్ షోలో, శ్రీనివాస నగర్ టీచర్స్ కాలనీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడారు.
జిల్లాలో భూకబ్జాలు, గోదావరి ఇసుక, కొండల కబ్జాలతో ఖమ్మంలో అరాచకం పెరిగిందన్నారు. అధికార పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పేదల ఇళ్ల స్థలాల పట్టాలు అమ్ముకోవడం, అవినీతి, దౌర్జన్యాలకు పాల్పడటం సాధారణమైందన్నారు.
కమ్మ, కాపు కులాల మధ్య తగవులు పెట్టడం, మైనార్టీల్లో వర్గ పోరు సృష్టించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్రానైట్ అసోసియేషన్‌లలో మ వర్గాలు తయారు చేసేలా కుట్రపూర్తి రాజకీయాలు చేస్తున్నరన్నారు. బెదిరించే నాయకులకు భయపడవద్దని.. ఆత్మగౌరవంతో అహంకార నేతలను తరమి కొట్టాలన్నారు.
ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో మంచి మార్పులు తెస్తాయన్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు సాగిన అవినీతి, కుటుంబ, నియంతృత్వ కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించాలని, పాలన మార్పు కు కాంగ్రెస్ రావాలన్నారు. ప్రజాస్వామిక తెలంగాణకు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.