భారతదేశంలో నిరుద్యోగం పాకిస్తాన్ కన్నా ఎక్కువగా ఉంది: రాహుల్ గాంధీ
పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. ఆర్థికంగా భూటాన్ కన్నా వెనుకబడి ఉన్నామని చెపారు

గ్వాలియర్ : పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. ఆర్థికంగా భూటాన్ కన్నా వెనుకబడి ఉన్నామని చెపారు. నోట్ల రద్దు, జిఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు చేరుకుందని తెలిపారు. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల నిరుద్యోగం ఉందని అన్నారు. ఆర్థిక అసమానతలు, యువత, రైతుల పరిస్థితిని గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. జీఎస్టీ, నోట్ల రద్దు నిరుద్యోగ పెరుగుదలకు కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కంటే పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యం ఇస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రైతుల రుణమాఫీని విస్మరిస్తూ కొందరు పారిశ్రామికవేత్తలకు భారీ రుణమాఫీని ఇవ్వడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 2022- 23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ నిరుద్యోగ రేటు 3.2 శాతం కాగా, భారత నిరుద్యోగ రేటు 8.5 శాతం నమోదయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించింది. మణిపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రాలను చుడుతూ బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ మీదుగా ముంబైలో పూర్తి కానుంది. శనివారం మధ్యాహ్నం మొరైన జిల్లా మీదుగా మధ్యప్రదేశ్‌లోకి యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా యాత్ర సాగుతోంది. 15 రాష్ట్రాల్లో 6,700 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది.