కేంద్ర బడ్జెట్: ఆర్థిక క్రమ శిక్షణా? జనాకర్షణా?
విధాత: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ఉదయం 11 గంటలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె ఐదో సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజానీకం చాలా ఆశలు పెట్టుకున్నది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి, పూర్తిస్థాయి బడ్జెట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. కరోనా […]

విధాత: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ఉదయం 11 గంటలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె ఐదో సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజానీకం చాలా ఆశలు పెట్టుకున్నది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి, పూర్తిస్థాయి బడ్జెట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నాయి. గడిచిన ఏడాదికాలంగా పరిస్థితులు మెరుగుపడటంతో మెల్లగా పుంజుకుంటున్న ఆర్థిక స్థితిగతులపై రష్యా, ఉక్రెయిన్ యుద్ధం , ఆర్థికమాంద్యం పరిస్థితుల ప్రభావం పడింది. దీనికి తోడు భారత సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా కవ్వింపు చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించాల్సిన అనివార్యత ఏర్పడింది. అలాగే అధిక ధరలు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలు, నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత పెరిగిన నిరుద్యోగ కట్టడికి భారీగా నిధులు పెంచాల్సిన అవసరం ఉన్నది. అలాగే కరోనా సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి.
దీంతో పేద, మధ్య తరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వారి సంక్షేమం కోసం బడ్జెట్లో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అన్నది కూడా కీలకం కానున్నది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఆర్థిక క్రమశిక్షణకు కట్టబడి ఉంటుందా? జనాకర్షణ బడ్జెట్‌కు పట్టం కడుతుందా అనేది కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఆయావర్గాలను సంతృప్తి పరుస్తూనే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతున్నారు అన్నది ఆసక్తి నెలకొన్నది.
మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండు చాలాకాలంగా బలంగా వినిపిస్తున్నది. కానీ పన్నుల విషయంలో వారికి నిరాశే ఎదురవుతున్నది. ఈసారి వారు ఆశిస్తున్నట్టు భారీ వెసులుబాటు ఉండకపోయినా కొద్దోగొప్పో మార్పులు జరగవచ్చు. ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి తయారీ, మౌలిక సదుపాయాల రంగాలో భారీగా ఉద్యోగాలు కల్పించడానికి బడ్జెట్ ఆర్థికమంత్రి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు.
వ్యవసాయానికి అండగా ఉంటేనే..
కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలకుండా పోవడానికి కారణం వ్యవసాయం. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పటికీ 50 శాతం ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది.
కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ.. వ్యవసాయరంగానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీల ధరలు, ఎరువుల ధరలు పెంచింది.దీంతో ఈ రంగంపై ఆధారపడిన అన్నదాతలపై తీవ్ర భారం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా ఎన్ని చర్యలు తీసుకున్నా పంటల మద్దతు ధరల అంశం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో అయినా వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండే కేటాయింపులు ఉండాలని రైతాంగం ఆశిస్తున్నది.
అలాగే ఏ దేశం పురోగమించాలన్నా విద్య, వైద్యం, ఆరోగ్యం కీలకమైనవి. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యపై దృష్టి సారించాలి. నాణ్యమైన విద్యను అందించడానికి తగిన నిదులు కేటాయించాలి. విద్యాబివృద్ది కోసం కేవలం ఉపాధ్యాయులు, లెక్చరర్లు, యూజీసీ వంటిపైనే ఆధారపడకుండా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ రంగ పరిధిలోనే విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలి.
అలాగే ఆరోగ్య రంగానికి కూడా తగిన నిధులు కేటాయించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ఊతమిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధులు పెంచకపోగా తగ్గిస్తూ వస్తున్నది. కొవిడ్ కాలంలో ఉపాధి, ఉపాధి అవకాశాలు చాలా దెబ్బతిన్నాయి. కానీ పారిశ్రామిక, సేవల రంగంలో పనిచేస్తున్న వాళ్ల ఉద్యోగాలు పోయాయి.
కానీ వ్యవసాయరంగంలో పనిచేస్తున్న వారి ఉపాధి పోలేదు. కొవిడ్ కాలంలోనూ వ్యవసాయరంగ పనులు కొనసాగాయ. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు అది దోహదపడింది. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేంద్రం ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నది.