Congress | సఖ్యతే కాంగ్రెస్‌లో సమస్య! ఆధిపత్యం కోసం ఆరాటం

Congress | ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ వ్యతిరేక సంకేతాలతో బీఆరెస్‌ అలర్ట్‌ బీజేపీది వాపే అంటున్న పరిణామాలు బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటా పోటీ కానీ.. తీరు మార్చుకోని కాంగ్రెస్‌ నేతలు కీలక సమయాల్లోనూ అంతర్గత చిచ్చు (విధాత ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఐదారు నెలల సమయం మాత్రమే ఉన్నది. అధికార బీఆరెస్‌ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. గత రెండు […]

  • By: krs    latest    Jul 30, 2023 5:10 PM IST
Congress | సఖ్యతే కాంగ్రెస్‌లో సమస్య! ఆధిపత్యం కోసం ఆరాటం

Congress |

  • ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ
  • వ్యతిరేక సంకేతాలతో బీఆరెస్‌ అలర్ట్‌
  • బీజేపీది వాపే అంటున్న పరిణామాలు
  • బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటా పోటీ
  • కానీ.. తీరు మార్చుకోని కాంగ్రెస్‌ నేతలు
  • కీలక సమయాల్లోనూ అంతర్గత చిచ్చు

(విధాత ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఐదారు నెలల సమయం మాత్రమే ఉన్నది. అధికార బీఆరెస్‌ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని సర్వేలు, విశ్లేషణలు వెలువడుతుండటంతో అప్రమత్తమమైంది. బీఆరెస్‌కు ప్రత్యామ్నామయం తామేనని, ఈసారి గెలుపు తమదనని, తమ గెలుపుతో రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాబోతున్నదని బీజేపీ నేతల ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్యే ఈసారి హోరాహోరీ పోటీ ఉండబోతున్నదనే సంకేతాలు స్పష్టంగా వెలుడుతున్నాయి.

తాజాగా ఒక అధ్యయనం ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 17 స్థానాల్లో సగం సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్తాయని తేలింది. అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీకి కొంత దూరంలో బీఆరెస్‌, కాంగ్రెస్‌ ఉంటాయని ఆ మధ్య కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని స్వయంగా చేయించుకున్న సర్వేలోనే తేలిందని సమాచారం.

ఓ పదిహేను స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండబోతున్నదని, అందులో మెజారిటీ సీట్లు ఎవరికి దక్కితే వారిదే విజయం అని అంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ శ్రేణులు కలిసి కట్టుగా శ్రమిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని క్షేత్రస్థాయి పరిణామాలు, ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది.

కానీ కాంగ్రెస్‌ తీరేవేరు

అయితే ఐక్యతే కాంగ్రెస్‌ పార్టీలో సమస్యగా మారింది. ఇప్పటికే అన్ని పార్టీల్లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు ఉండటం గమనార్హం. రాష్ట్ర నేతల మధ్య ఐక్యత కోసం పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నది. టీపీసీసీ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన నేతలు పార్టీ అధిష్ఠానంతో భేటీ కావడం, పార్టీ పెద్దల సూచనల నేపథ్యంలో నిరసనలు సద్దుమణిగినట్టే కనిపించింది.

కానీ.. ఆచరణలో పరిస్థితులు మాత్రం ఇంకా అలానే కునారిల్లుతున్నాయి. కీలక నేతలంతా విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు. నాయకుల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా మళ్లీ బహిర్గతమౌతున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్‌ పార్టీని వీడి, బీఆరెస్‌ కండువా కప్పుకొంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్నది.

దీన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారాలను తెరమీదికి తెస్తున్నారని అంటూనే దీని వెనుక ఉన్నది సొంత పార్టీలోని ముఖ్యస్థానంలో ఉన్న నాయకుడే అని ఆరోపించారు. ఉత్తమ్‌ వ్యాఖ్యలు రేవంత్‌ను ఉద్దేశించి చేసినవేనని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీలో ముఖ్యస్థానంలో ఉన్న నేతలు ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని రాహుల్‌ గాంధీ ఇటీవలే స్పష్టంగా చెప్పారు.

అయినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి నేతలు అధికారపార్టీపై కంటే సొంతపార్టీ నేతలపై, ముఖ్యంగా రేవంత్‌ వ్యవహారశైలిపైనే విమర్శలు చేస్తున్నారు. ఇవి మీడియాలో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. పార్టీ కార్యకర్తలను, శ్రేణులను అయోమయంలోకి నెట్టేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

బీఆరెస్‌కు, బీజేపీకి ప్రత్యర్థిలా కాంగ్రెస్‌

రాజకీయంగా బీజేపీ, బీఆరెస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నదని, ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి పరోక్షంగా కలిసి పనిచేస్తాయనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఈ మధ్య కాలంలో అధికారపార్టీ బీజేపీపై విమర్శలు బాగా తగ్గించిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు ఇండియా కూటమిలోని చాలా ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

కర్ణాటకలో బీజేపీని కట్టడి చేయడానికి కాంగ్రెస్‌ నేతలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టారు. జాతీయ నాయకత్వం ప్రచారం చేసినా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ లాంటి నేతలు బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులను, కార్యకర్తనలు ముందుండి నడిపించారు. ఎన్నికలు అయిపోయేదాకా ఒక్కతాటిపై నడిచారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు.

మరి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఎంతమంది అంత కమిట్‌మెంట్‌తో ఉన్నారనే ప్రశ్న ఆ పార్టీ కార్యకర్తల నుంచే ఎదురవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, కలిసి శ్రమిస్తే ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని వారు అంటున్నారు. ఈ సమయంలో విభేదాలు పక్కనపెట్టి, ఐక్యంగా సాగితేనే ప్రజలు ఆదరిస్తారని, లేకపోతే ప్రతికూల ఫలితాలు చవిచూడాల్సి వస్తుందంటున్నారు.