South Korea | దక్షిణకొరియాలో కూలిన అమెరికా యుద్ధ విమానం..
దక్షిణకొరియాలోని అమెరికా బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్-16 యుద్ధ విమానం కుప్పకూలింది.

- నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన
South Korea | విధాత: దక్షిణకొరియా (South Korea) లోని అమెరికా బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్-16 (American F-16) యుద్ధ విమానం కుప్పకూలింది. పశ్చిమ సరిహద్దుల్లోని సముద్రజలాలపై ఎగురుతుండగా బుధవారం ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనలో పైలట్‌ను ప్రాణాలతో రక్షించామని స్థానికంగా ఉన్న అమెరికా వాయుసేన బేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే గత నెల రోజుల కాలంలో అమెరికాకు చెందిన రెండో ఎయిర్‌క్రాఫ్ట్ ఇలా ప్రమాదానికి గురికావడం గమనార్హం.
తాజా ప్రమాదంలో కూలిపోయిన విమానాన్ని ఇక్కడి కుసాన్ ఎయిర్‌బేస్‌లో 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఫైటర్ జెట్‌గా గుర్తించారు. ‘కొరియా రాజధాని సియోల్‌కు 180 కి.మీ. దూరంలో ప్రయాణిస్తుండగా.. పైలట్ ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చారు. అనంతరం కొద్ది నిమిషాలకే సముద్రంలో అది కూలిపోయింది. ఎంతో చాకచక్యంతో పైలట్ ఎజెక్ట్ అవ్వగా ఆయనను సహాయక బృందాలు సముద్రంలో తీవ్రంగా గాలించి గుర్తించాయి. అతను స్పృహలోనే ఉన్నాడు. ఎయిర్‌బేస్‌లోని ఆసుపత్రికి తరలించాం’ అని అమెరికా సైనికాధికారులు వెల్లడించారు.
‘మేము కొరియా రెస్క్యూ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మా పైలట్‌ను గుర్తించడంలో వారు చేయాల్సిందంతా చేశారు’ అని తన ప్రకటనలో పేర్కొన్నారు. కూలిపోయిన విమానం సముద్రంలో గల్లంతయిందని.. దాని కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. కాగా ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు అమెరికా సైన్యాన్ని కలవరపెడుతున్నాయి.
ఒక్క దక్షిణకొరియాలోనే చూసుకున్నా.. గత ఏడాది మే నుంచి ఇప్పుడు జరిగింది మూడో ప్రమాదం కావడం గమనార్హం. గత నెలలోనే ఒక ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయింది. ఆ ఘటనలోనూ పైలట్‌ను ప్రాణాలతో రక్షించారు. దక్షిణ కొరియాకు సైనికంగా అత్యంత నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతున్న అమెరికా.. తన 28,500 సైనికులను ఇక్కడి వివిధ బేస్‌ల్లో మోహరించి ఉంచింది.