Pahalgam terror attack: భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు !

జమ్మూకశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ద మేఘాలు అలుముకుంటున్నాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్తాన్ మిలటరీ అధికారులు భారత్ సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నారు. కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి కి యుద్ధ విమానాలను తరలించింది. పాక్ కవ్వింపు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్నాయి.

Pahalgam terror attack: భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు !

Pahalgam terror attack: జమ్మూకశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ద మేఘాలు అలుముకుంటున్నాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్తాన్ మిలటరీ అధికారులు భారత్ సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నారు. కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి కి యుద్ధ విమానాలను తరలించింది. పాక్ కవ్వింపు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. భారత్ నుంచి కూడా భద్రతా బలగాలు సరిహద్దు భద్రతపై నిఘా పెంచాయి. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర కేబినెట్ మంత్రులందరిని ఢిల్లీకి రమ్మని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాలతో భేటీ అయ్యారు.

పాక్ సరిహద్దుల వెంట రక్షణ పరిస్థితులను సమీక్షించారు. ఉగ్రదాడి అనంతరం పహల్గామ్ వెళ్లిన హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రవాదుల దాడితో నెలకొన్న పరిణామాలను  సమీక్షిస్తూ భద్రతా బలగాలకు మార్గదర్శకం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతను జరిగే కేబినెట్ కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా మరోసారి పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టవన్న ప్రచారం వినిపిస్తుంది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.  జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది. అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది. ఉగ్రవాదుల జాడ కనుగొనేందుకు HAL ధ్రువ్ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.

ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్‌ ఓవర్సీస్‌ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో చేసిన విద్వేషపు ప్రసంగం అందులో భాగమేనని భావిస్తున్నారు. మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్‌ గతంలోనూ మన గొంతులోని రక్తనాళంలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్‌ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు.

మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే పహల్గాం దాడి చోటుచేసుకొందని.. అదే సమయంలో పాక్‌ వాయుసేనకు చెందిన రవాణ, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్‌, రావల్పిండి బేస్‌లకు తరలించడం కూడా అనుమానాలను బలపరుస్తోందని ఎన్ ఐఏ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై దాడి సమయంలో పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అధిపతి కావడం గమనార్హం. పుల్వామా దాడి ఆయన ప్రోత్సాహంతోనే సాగిందన్న ఆరోపణలున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’కు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సహకారం ఉందని ఎన్ఐఏ అంచనా వేస్తుంది.

వారితోనే సమస్య..జమ్మూకశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు!

జమ్మూకశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడించారు. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులున్నారని పేర్కొన్నాయి. 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ఉగ్ర సంస్థలకు చెందినవారని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్‌తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్‌కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఇక 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఆందోళన కరంగా మారిందని భద్రతాధికారులు చెబుతున్నారు.

క్రియాశీలకంగా టీఆర్ఎఫ్

పాక్‌కు చెందిన లష్కరే తోయిబాకు ముసుగు సంస్థ టీఆర్‌ఎఫ్‌ (ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌) లష్కరే కోర్‌ గ్రూప్‌ నుంచి టీఆర్‌ఎఫ్‌లోకి నియామకాలు చేపట్టినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. గత నాలుగేళ్లుగా టీఆర్‌ఎఫ్‌ పౌరులను లక్ష్యంగా హిట్‌ అండ్‌ రన్‌ (దాడి చేసి పారిపోవడం) దాడుల వ్యూహాన్ని అమలు చేస్తుంది. 2021 శ్రీనగర్‌ వాయుసేన స్థావరంపై జరిపిన జంట డ్రోన్ల దాడులలో కూడా ఈ సంస్థ ప్రమేయముంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ను కూడా టీఆర్‌ఎఫ్‌ బెదిరించింది. పాకిస్తాన్ నుంచి టీఆర్ఎఫ్ కు సహాయ సహకారాలు అందుతుండటంతో ఈ సంస్థ భారత్ వ్యతిరేక దాడులను కొనసాగించగలుగుతుందని నిఘా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.