Warangal | ఓరుగల్లు అభివృద్ధిపై కారు మబ్బులు.. పొలిటికల్ విల్ పవర్ లేని నేతలు
Warangal పొలిటికల్ విల్ పవర్ లేని నేతలు ప్రజాప్రతినిధులెందరున్నా నిర్లక్ష్యం పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధి పై లేదు వరదతో బేజారైన వరంగల్ సిటీ జనం బయటపడిన అభివృద్ధి డొల్లతనం రూ.1400 కోట్ల ప్రాథమిక అంచనా మొక్కుబడిగా రూ.250 కోట్ల నిధులు ఓరుగల్లు గడ్డ ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్య రాజధానిగా వెలుగొందింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రెండవ అతిపెద్ద నగరంగా కీర్తించబడుతోంది. అయితేనేం… అభివృద్ధిలో ఆశించిన పురోగతి కానరావడం లేదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు […]

Warangal
- పొలిటికల్ విల్ పవర్ లేని నేతలు
- ప్రజాప్రతినిధులెందరున్నా నిర్లక్ష్యం
- పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధి పై లేదు
- వరదతో బేజారైన వరంగల్ సిటీ జనం
- బయటపడిన అభివృద్ధి డొల్లతనం
- రూ.1400 కోట్ల ప్రాథమిక అంచనా
- మొక్కుబడిగా రూ.250 కోట్ల నిధులు
ఓరుగల్లు గడ్డ ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్య రాజధానిగా వెలుగొందింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రెండవ అతిపెద్ద నగరంగా కీర్తించబడుతోంది. అయితేనేం… అభివృద్ధిలో ఆశించిన పురోగతి కానరావడం లేదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల అశ్రద్ధ ఫలితంగా వరంగల్ నగరం సమస్యల నిలయంగా మారింది. రాజకీయ నాయకులకు ‘పొలిటికల్ విల్ పవర్’ లేకపోవడం ప్రధాన కారణంగా విమర్శకులు చెబుతున్నారు. ప్రధానంగా కొత్త రాష్ట్రంలోనైనా నగరాభివృద్ధి పురోగమిస్తుందని భావిస్తే పరిస్థితిలో పెద్దగా మార్పులేదని మొన్నటి వరదలతో నగ్నంగా తేలిపోయింది. నగరంలోని 152 ప్రాంతాలు నీటమునిగాయనేది అధికారిక ప్రకటన. దాదాపు వారం రోజులు వేలాది మంది నగరవాసులు మురికినీటితో సహవాసం చేశారు. ఇప్పటి వరకు వారిని ప్రభుత్వపరంగా ఆదుకుందీలేదూ. అణా పైసా అర్ధిక అండ లభించిందీలేదు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రూ.1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ, వరంగల్ రెండు జిల్లాలకు కేంద్రంగా గ్రేటర్ వరంగల్ విలసిల్లుతోంది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధితో 66 మునిసిపల్ కార్పొరేషన్ డివిజన్లతో వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు పట్టణాలను కలుపుకొని ట్రైసిటీగా పిలువబడుతోంది. అనుబంధంగా 42 గ్రామాలను విలీనం చేసుకొని 2015లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌గా అవతరించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం అధికారికంగా గ్రేటర్ పరిధిలో ఏడు లక్షల పైగా జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం నూతన జనాభా లెక్కలు కేంద్రం సేకరించినందున జనాభా పెరుగుదల నిష్పత్తి ప్రకారం పది లక్షలకు పైగా ఈ నగరంలో నివాసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
అధికారంపై ఉన్న యావ అభివృద్ధి పై లేదు
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల కార్యకలాపాలకు, పదవీ రక్షణ కోసం అధినేతల వద్ద ప్రాపకం కోసం పడేపాట్లలో ఒక్క వంతు నిజాయితీ కనపరిచిన ఈ పేరెన్నికగల నగరం రూపురేఖలు మారిపోయేవనే అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. భారీగా ప్రజాప్రతినిధులున్నా వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమ నగర రూపురేఖలు మార్చేవారని అభిప్రాయం సర్వత్రా నెలకొంది.
తాజాగా వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వరదల సందర్భం, ఇటీవల జరిగిన బల్దియా బడ్జెట్ సమావేశం పట్ల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కనబరిచిన అశ్రద్ధ నిదర్శనంగా పేర్కొంటున్నారు. వరద తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినా మొక్కుబడి ప్రకటనలు తప్ప నోరు మెదిపిందీలేదూ. శాసనమండలిలో మాత్రం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాత్రం నగరాభివృద్ధి గురించి మాట్లాడారు. విచిత్రమేమిటంటే జిల్లా నుంచి సుదీర్ఘకాలం మంత్రిగా, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం మరిపోయినట్లున్నారు.
ఆయన హయంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ ప్రదర్శించి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టియుఎఫ్ ఐడిసీ) ద్వారా రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం కాస్తా ఉపశమనం. కనీసం ఎన్నికల దృష్ట్యానైనా ఈ నగరాభివృద్ధి పై ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం పట్ల విమర్శిస్తున్నారు.
బడ్జెట్ సమావేశం పట్ల నిర్లక్ష్యం
ఏ అభివృద్ధికైనా ఆ బడ్జెట్ ప్రాతిపదికగా నిలుస్తుంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ బడ్జెట్ ఆమోదించే సమావేశం కొద్ది రోజుల క్రితం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగింది. రూ. 612 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన బడ్జెట్‌ను ఆమోదించారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. కానీ ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రేటర్ వరంగల్ తో ప్రజా ప్రాతినిధ్య సంబంధం ఉన్న వారిలో 90 శాతం మంది ఎంపీ,ఎమ్మల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం వారికి సమావేశాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ఈ సమావేశానికి కమిషనర్ ప్రావీణ్య తో పాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పటేల్ హాజరైనప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. గతంలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా నగరానికి ఏటా రూ.300 కోట్లు ఇస్తామని ప్రకటించారు. రెండు పర్యాయాలు ఈ నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు.
అధికార పార్టీ నేతలు కనీసం ఈ విషయాన్నైనా సీ ఎంకు గుర్తు చేయొచ్చు. కానీ, ఆ సమర్థ నాయకత్వంలేదని చెప్పవచ్చు. కార్పొరేషన్ ఆదాయం రోజువారీ కార్యకలాపాల నిర్వహణకే సరిపోతోంది. ఏ అభివృద్ధి సాగాలన్నా, రాష్ట్రం పైన్నో, కేంద్రం పైన్నో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
భారీగా ప్రజా ప్రతినిధుల బలగం
గ్రేటర్ వరంగల్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా పదవిరీత్యా, బాధ్యతల రీత్యా సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులను ఒకసారి పరిశీలిద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మంత్రులుగా నగరాభివృద్ధిపై చేసిన సమీక్షలూ, కనపరిచిన శ్రద్ధ ఏమీలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాప్రతినిధులంతా కార్పొరేషన్ లో భాగస్వాములే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్. ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్ళపల్లి రవీంద్ర రావు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీగా తాజా మండలి డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బండా ప్రకాష్ గ్రేటర్ వరంగల్ తో సంబంధం ఉంది. ఇందులో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారంతా ఎన్నికల సందర్భంలోనూ లేక ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాలపై గ్రేటర్ పరిధిలో నిత్యం పేర్లు కనబడుతున్న వారే కావడం గమనించాల్సిన విషయం.
పొలిటికల్ విల్ పవర్ శూన్యం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి వివిధ కారణాల రీత్యా ప్రజా ప్రతినిధులు హాజరు కాలేకపోయారని భావించినా… ఇతరత్రా నగరాభివృద్ధికి కనపరుస్తున్న పెద్ద శ్రద్ధ కూడా లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం పైన, రాష్ట్రం పైన ఒత్తిడి తెచ్చే పొలిటికల్ విల్ పవర్ కనబరుస్తున్నారా? అంటే అది కూడా లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతో వచ్చిన ఆదాయం మేరకు ఇచ్చిన గ్రాంట్ల మేరకు నగరాభివృద్ధి చేపట్టడంతో పెరిగిన జనాభా ప్రజా అవసరాలకు అనుగుణమైన కార్యక్రమాలు చేపట్టడం నత్త నడకన సాగుతోంది.
ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఎలా గెలవాలని లక్ష్యం తప్ప ,తమ ప్రాంతం, తమ నగరం అని ప్రత్యేక ఆకాంక్ష కనబరచడం లేదు. ఫలితంగా దశాబ్దాలుగా వరంగల్ నగర పరిస్థితి అభివృద్ధికి నోచుకోకుండా అత్తెసరు వసతులతో స్థానికులు వెల్లదీస్తున్నారు. నగరాభివృద్ధికి దూరదృష్టితో కూడిన నేతలు లేక పోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వరంగల్ నగర ప్రజలకు శాపంగా మారింది.