Warangal | వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

అధికారికంగా ఖరారుకాని పర్యటన పంట నష్టాన్ని పరిశీలించే అవకాశం అడవి రంగాపురంలో హెలిప్యాడ్ పూర్తి స్పష్టత లేదంటున్న అధికారులు నర్సంపేటకు మంత్రిఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) వరంగల్ (Warangal) జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురానికి మంగళవారం రానున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ అడవి రంగాపురం (చాపల బండ)లో హెలిప్యాడ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ […]

Warangal | వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • అధికారికంగా ఖరారుకాని పర్యటన
  • పంట నష్టాన్ని పరిశీలించే అవకాశం
  • అడవి రంగాపురంలో హెలిప్యాడ్
  • పూర్తి స్పష్టత లేదంటున్న అధికారులు
  • నర్సంపేటకు మంత్రిఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) వరంగల్ (Warangal) జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురానికి మంగళవారం రానున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ అడవి రంగాపురం (చాపల బండ)లో హెలిప్యాడ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కూడా స్పష్టతనివ్వలేకపోతున్నారు. అయితే కేసీఆర్ పర్యటనకు వారంతా సిద్ధమవుతున్నారు.

నర్సంపేటలో భారీగా పంట నష్టం

వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం పంట నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా సీఎం పర్యటన ఉంటుందని చర్చ సాగుతోంది.

నర్సంపేటకు మంత్రి, ఎమ్మెల్యేలు

ఇదిలా ఉండగా గతేడాది వడగండ్ల వానతో పంట నష్టపోయిన నర్సంపేట ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఈ పరిహారానికి సంబంధించిన చెక్కులను మంగళవారం రైతులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao), బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (MLA Aruri Ramesh), పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (MLA Challa Dharma Reddy), వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరుకానున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.

కాగా.. మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు జిల్లా ముఖ్య నేతలు, అధికారులు హాజరై అందుబాటులో ఉన్నందున సీఎం పర్యటనకు అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే ఈ కార్యక్రమం ముందుగానే నిర్ణయించినట్లు చెబుతున్నారు.

కాగా, ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గం లో పంట నష్టపోయిన ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే పెద్ది పరిశీలించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం పర్యటిస్తే పరిహారానికి చెల్లింపునకు సంబంధించి భరోసా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.