Warangal | రైతాంగానికి ఓదార్పు సరే.. పంట పరిహారమేదీ?

పంటపొలాల్లో గులాబీ ఎమ్మెల్యేలు రెండేళ్లుగా అన్నదాతపై రాళ్లవాన దెబ్బ ఎన్నికల సంవత్సరం పైన్నే కాసింత ఆశ చేతికి వచ్చే పంటను రాళ్ల వాన రైతుల నోటికి అందకుండా చేసింది. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని రైతాంగాన్ని వడగండ్ల వాన కోలుకోలేని దెబ్బతీసింది. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులకు తోడు అందాల్సిన ఆదాయం కోల్పోవడంతో చెంప దెబ్బ, గోడ దెబ్బ అనే తీరుగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత ఏడాది కూడా రైతాంగాన్ని వడగండ్ల […]

Warangal | రైతాంగానికి ఓదార్పు సరే.. పంట పరిహారమేదీ?
  • పంటపొలాల్లో గులాబీ ఎమ్మెల్యేలు
  • రెండేళ్లుగా అన్నదాతపై రాళ్లవాన దెబ్బ
  • ఎన్నికల సంవత్సరం పైన్నే కాసింత ఆశ

చేతికి వచ్చే పంటను రాళ్ల వాన రైతుల నోటికి అందకుండా చేసింది. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని రైతాంగాన్ని వడగండ్ల వాన కోలుకోలేని దెబ్బతీసింది. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులకు తోడు అందాల్సిన ఆదాయం కోల్పోవడంతో చెంప దెబ్బ, గోడ దెబ్బ అనే తీరుగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత ఏడాది కూడా రైతాంగాన్ని వడగండ్ల వాన తీవ్రంగా నష్టం చేసింది. ఆ అప్పుల నుంచి ఇంకా రైతాంగం కోలుకోలేదు. గోరుచుట్టు మీద రోకటి పోటు లెక్క ఈ ఏడాది కూడా పంట చేతికి వచ్చే టైంలో ఈదురుగాలులు, వడగండ్లు పంటను తీవ్రంగా నష్టపరిచాయి.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, కూరగాయల తోటలు, పండ్ల తోటలు, మామిడి తోటలు, బొప్పాయి, అరటి, మునగ, పసుపు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

గతేడాది పరిహారానికి గతి లేదు

గతసంవత్సరం దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతేడాది జరిగిన పంట నష్టానికి ఇంకా పరిహారం రాని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, అధికార పార్టీ నేతల బృందం పర్యటించి హడావుడి చేశారు. భూపాల పల్లి, పరకాల, నర్సంపేట ప్రాంతాలను సందర్శించి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదు. ఈ ఏడాది పంట నష్టం వస్తుందో? రాదో? తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే తప్ప పరిహారం వచ్చే అవకాశాలు లేవు.

నర్సంపేటలో చెక్కుల పంపిణీ

గతేడాది పంట నష్టపరిహారం కోసం తీవ్రంగా ప్రయత్నించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పరిహారం వచ్చే విధంగా కృషి చేశారు. గతేడాది పంట నష్టానికి సంబంధించిన చెక్కులను మంగళవారం రైతాంగానికి అందజేశారు.

పంట క్షేత్రాల్లో రాజకీయ, అధికార ప్రతినిధులు

రాజకీయ కార్యకలాపాలతో బిజీ బిజీగా ఉండే ఎమ్మెల్యేలంతా నేల వాలిన పంటలను పరిశీలిస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందుకు వేసి రైతుల కన్నీళ్లు తుడుస్తామని భరోసా ఇస్తున్నారు. విపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అకాల వర్షాలతో జిల్లాలో పంట నష్టం వాటిల్లిందని జరిగిన నష్టం పై జిల్లా అధికారులతో మాట్లాడానని రైతులను ప్రభుత్వ ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అందరూ క్షేత్రసందర్శనలో ఉంటే ఈయన హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఓదార్పు సరే పరిహారమేది?

ఎమ్మెల్యేల హామీతో రైతుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతున్నా ఆర్థిక చేయూత అందించేందుకు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని సంశయం వ్యక్తమైతుంది.

బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు. నివేదికలు రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిహారం ఇప్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానుకోట జిల్లాలో పర్యటించిన సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో మంత్రి వెంట మహబూబాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు శశాంక్, శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు కృష్ణవేణి, రమేష్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల క్షేత్ర సందర్శనలు

నర్సంపేట నియోజకవర్గం లోని దుగ్గొండి నల్లబె ల్లి నెక్కొండ మండలాలలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో దెబ్బతిన్న పంటలను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు. ఖిలా వరంగల్, ఉర్సు ప్రాంతాలలో దెబ్బతిన్న పంటలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పరిశీలించారు.గూడూరు మండలంలో ధ్వంసమైన పంటలను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిశీలించారు. సంగెం మండలం గీసుగొండలో దెబ్బతిన్న పంటలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు.

రైతులను ఆదుకోవాలి: విపక్షాలు

వడగండ్ల వాన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖిలా వరంగల్ మండలం దూపగుంట శివారు లో వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి , హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

అకాల, వడగండ్ల వర్షాల వల్ల తీవ్ర నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా ఉపాద్యక్షులు, ముల్కలగూడెమ్ సర్పంచ్ బండి పర్వతాలు డిమాండ్ చేశారు. ఐనవోలు మండలంలో మొక్కజొన్న, వరి, మామిడి, కూరగాయల పంటలను పరిశీలించారు.

రాష్ట్రం లో పంటల భీమా పధకం అమలులో ఉండుంటే, రైతన్నలకు ఏంతో కొంత పరిహారం అందేదని మాజి శాసన సభ్యులు,బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అన్నారు. పరామర్శతో రైతుల బాధ తీరదు. ఏనుగులు, చౌటపల్లి గ్రామాలలో అకాల వర్షాల కారణంగా పంట నష్ట పాయిన రైతులను పరామర్శించి,పాడైపోయిన పంటను పరిశీలించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి

కలెక్టర్‌కు రైతు సంఘాల వినతి

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సంగెం, గీసుకొండ మండలాల్లో పర్యటించామని తెలిపారు. రెండు సంవత్సరాల నుండి అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వము పరిహారం ఇవ్వాలని కోరారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతు, కూలీ సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య,సుదమల్ల భాస్కర్,వల్లందాసు కుమార్, ఏన్నంనేనీ వెంకటేశ్వరరావు, రాజేష్, హరిబాబు తదితరులు ఉన్నారు.

గోవిందరావు పేట మండలం మచ్చా పూర్ గ్రామములో వడ గండ్ల వాన తో దెబ్బ తిన్న వరి పంట పొలాలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే పంట నీటిపాలవడంతో తో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.