Warangal | వరంగల్‌లో హై టెన్షన్.. హనుమకొండ కోర్టు వద్ద ఉద్రిక్తత
ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ నమోదు భారీగా పోలీసు బందోబస్తు మోహరించిన ఇరు పార్టీ శ్రేణులు బిజెపి నిరసనలు- బిఆర్ఎస్ ఆగ్రహం సంజయ్, కెసిఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మంగళవారం అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా బొమ్మలరామారం నుంచి […]

- ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ నమోదు
- భారీగా పోలీసు బందోబస్తు
- మోహరించిన ఇరు పార్టీ శ్రేణులు
- బిజెపి నిరసనలు- బిఆర్ఎస్ ఆగ్రహం
- సంజయ్, కెసిఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం
- బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మంగళవారం అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా బొమ్మలరామారం నుంచి బండి సంజయ్ ను హనుమకొండ కోర్టుకు తరలించే క్రమంలో నెలకొన్న హై డ్రామా నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు అధికార పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా సాగుతున్న నిరసనలు, ఆందోళనలు అరెస్టులు ముందస్తు అరెస్టులతో పరిస్థితి తీవ్రంగా వేడెక్కింది. ముఖ్యంగా కోర్టు వద్ద ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులను ఎప్పటికప్పుడు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.
కేసుల వివరాలు
సంజయ్ పై ఏ కేసు నమోదు చేశారనేది ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే బండి సంజయ్ అరెస్టును సీపీ రంగనాథ్ దృవీకరించారు. సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం.420 120 బి సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ కింద నమోదు చేశారు. ఇందులో బండి సంజయ్ ని కుట్రధారుగా పేర్కొన్నారు. ఇంకా ఏమైనా కేసులు పెడుతారా? చూడాలి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
సీపీ ప్రెస్‌మీట్
ఇది ఇలా ఉండగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీ బండి సంజయ్‌ను ప్రవేశ పెడతారా? లేదా అనే అనుమానాలు ఉన్నాయి.
పెంబర్తి వయా పాలకుర్తి టు హనుమకొండ
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆలేరు సమీపంలోని పెంబర్తి వద్ద బండి సంజయ్ ని యాదాద్రి పోలీసులు వరంగల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ పోలీసుల వాహనాలకు బిజెపి నాయకులు అడ్డు తగిలారు. అక్కడ నుంచి పాలకుర్తి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం వర్ధన్నపేట మీదుగా హనుమకొండలోని కోర్టు ఆవరణలో ఉన్న జడ్జి క్వార్టర్స్ వద్దకు తీసుకొచ్చే విధంగా పోలీసులు ముందస్తు ప్రణాళిక రచించారు. బుధవారం సెలవు కావడంతో జడ్జి ఇంటి వద్ద బండి సంజయ్ ని హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే సంజయ్ ని ఏ సమయానికి హనుమకొండకు తీసుకొస్తారని ఇంకా పూర్తి సమాచారం చెప్పడం లేదు.
నిరసనలు, దిష్టిబొమ్మల దహనం
బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా నిరసనలు కొనసాగిస్తుంది. లీకేజీకి కారణమని బండి సంజయ్ దిష్టిబొమ్మలను టిఆర్ఎస్ నాయకులు దగ్ధం చేస్తుండగా, సంజయ్ అరెస్టును నిరసిస్తూ బిజెపి నేతలు కేసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల బండి సంజయ్ ని తరలిస్తున్న కాన్వాయిని అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
టిఆర్ఎస్ పై బిజెపి నేతల విమర్శ
బిజెపి నాయకులు తమ నేతను ఎక్కడికి తరలిస్తున్నారు. ఏ ఏ కేసులు పెట్టారు చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కరీంనగర్లో అరెస్టు చేసి బొమ్మలరామారం తీసుకువెళ్లి అక్కడి నుంచి హనుమకొండకు తీసుకురావడం ఏమిటంటూ విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కరెక్ట్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిజెపిపై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం
లీకేజీకి కారణమైన బండి సంజయ్ ని ఎంపీగా అనర్హునిగా ప్రకటించాలని ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు. బిజెపి బండి సంజయ్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్రకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు.