WARANGAL: ముదిరిన పశ్చిమ కాంగ్రెస్ వర్గపోరు.. రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్
జంగా వ్యాఖ్యలపై నాయిని రియాక్షన్ బహిర్గతమైన నాయకుల గ్రూపులు రాజేందర్ రెడ్డి వర్సెస్ రాఘవ రెడ్డి జోడో యాత్రలతో విభేదాలు బహిర్గతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల రాఘవరెడ్డి పశ్చిమ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ […]

- జంగా వ్యాఖ్యలపై నాయిని రియాక్షన్
- బహిర్గతమైన నాయకుల గ్రూపులు
- రాజేందర్ రెడ్డి వర్సెస్ రాఘవ రెడ్డి
- జోడో యాత్రలతో విభేదాలు బహిర్గతం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల రాఘవరెడ్డి పశ్చిమ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తూ సోమవారం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీర్మానం చేశారు. తక్షణ చర్యల నిమిత్తం ఈ తీర్మానం పీసీసీకి పంపించినట్లు ప్రకటించారు.
ఇటీవల జంగా రాఘవరెడ్డి పశ్చిమ నుంచి తానే పోటీ చేస్తానంటూ, పోటీగా జోడోయాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ లో అంతర్గతంగా రాజుకున్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇంతకాలం తెర వెనక ఉన్న గ్రూపులు రోడ్డున పడ్డాయి. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య పశ్చిమ టిక్కెట్టు పోరు ఇప్పుడు తీవ్ర సమస్యగా మారింది. ఇరువురు డిసిసి అధ్యక్షులు బజారునపడి, కొట్లాడుతుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కాక పుట్టించిన రాఘవరెడ్డి
నాయిని స్థానికుడు కాదు…నా కోసం పనిచేస్తాడంటూ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలు పశ్చిమ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయిని రాజేందరెడ్డి స్థానికుడు కాదు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేటలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. నాది ఈ ప్రాంతం. ఇక్కడి ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు. నాయిని నా కోసం పనిచేస్తాడు. అవసరమైతే రెండు మూడు కోట్లు ఖర్చు పెడుతాడు. నా గెలుపు కోసం పనిచేస్తాడు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వరంగల్ పశ్చిమ టికెట్ నాదే.. గెలుపు నాదేనని జంగా స్పష్టం చేశారు.
పక్క జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ హనుమకొండ జిలాల్లో పాదయాత్ర చేయడానికి జంగా రాఘవ రెడ్డి ఎవరు ? కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గ్రూపులుగా తయారు చేసి పార్టీని భ్రస్టు పట్టిస్తున్నాడని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాజీపేటలో జంగారాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
గతంలో అధిష్టానం షోకాజ్ నోటీసు
రాఘవ రెడ్డికి పక్క జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించ వద్దని ఇది వరకే క్రమశిక్షణ సంఘం షోకాజు నోటీసు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ను లెక్క చేయకుండా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించి హన్మకొండ జిల్లాలో పర్త్యటిస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆధారాలతో సహా టిపిసిసి క్రమశిక్షణ సంఘానికి, ఏఐసిసి నాయకులకు మరొకసారి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తను ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూరే విధంగా వ్యవహరిసున్నారని రాజేందర్ రెడ్డి తెలిపారు.
నాయిని.. జంగా మధ్య పోటీ
హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు రాజేందర్ రెడ్డి చాలా రోజులుగా హాత్ సే హాత్ జోడోయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో జంగా రాఘవరెడ్డి జోడో యాత్ర ఇటీవల చేపట్టారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు వేరువేరుగా యాత్ర చేపట్టడం పార్టీలో గ్రూపులకు అద్దం పడుతుంది.
పరస్పరం ఘాటైన విమర్శలు
ఇరువురు నాయకులు బహిరంగంగానే నువ్వు దొంగ అంటే, నువ్వు దొంగ, నువ్వు రౌడీషీటర్ అంటే నువ్వు రౌడీ షీటర్, నువ్వు అమ్ముడు పోయావంటే నువ్వు అమ్ముడు పోయావు, ప్రతిపక్షాలకు దోహదం చేస్తున్నావంటూ పరస్పరం చేసుకుంటున్న విమర్శలు కాంగ్రెస్‌లో అతి ప్రజాస్వామ్యానికి అర్థం పడుతుంది.
పశ్చిమ టికెట్ ఆశిస్తున్న నాయిని
చాలాకాలంగా నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఆయన భంగపడ్డారు. ఈ కారణంగా ఈసారి టికెట్ నాకే ఇవ్వాలంటూ ఇటీవల హనుమకొండలో జరిగిన కార్నర్ మీటింగ్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కోరిన విషయం తెలిసిందే.
మూడు సెగ్మెంట్లపై జంగా దృష్టి
జంగా రాఘవరెడ్డి స్వస్థలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పశ్చిమపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కలకలం సృష్టించారు.
ఇప్పుడు ఏకంగా యాత్ర చేస్తున్నారు. దీంతో ఇంతకాలం సాగిన అంతర్గత పోరు బహిర్గతం చేశారు ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మామూలేననే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.