కేసీఆర్ దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. మరోటి వచ్చినా గడ్డే మేస్తుంది: రేవంత్‌రెడ్డి
విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ నియోజకవర్గంలో ఉండే మా గౌడ, పద్మశాలి, యాదవ సోదరులు, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు ఈ ప్రాంతంలో కష్టపడుతారు. ప్రజా సేవ కోసం వాళ్లను ఎన్నుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ, ఒక పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలు చాలా ఏళ్లు […]

విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ నియోజకవర్గంలో ఉండే మా గౌడ, పద్మశాలి, యాదవ సోదరులు, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు ఈ ప్రాంతంలో కష్టపడుతారు. ప్రజా సేవ కోసం వాళ్లను ఎన్నుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ, ఒక పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలు చాలా ఏళ్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి, నిజాయితీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని అన్నారు.
కార్యకర్తల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని మునుగోడులో కాంగ్రెస్ గెలుపుతోనే మార్పు వస్తుందన్నారు. నేను ఈ నియోజకవర్గ యువతను అడుగుతున్నా.. మీరంతా చదువుకున్న, చైతన్యం ఉన్న వాళ్లు. మీరు ఆలోచన చేయాలని కోరారు. 2014లో మోడీ ప్రధాని అయ్యారు, కేసీఆర్ సీఎం అయ్యారు. ఒక్కసారి కాదు రెండు సార్లు అయ్యారు ఎనిమిదేళ్ల కాలం పోయింది. మునుగోడులో నాడు కాంగ్రెస్ వేసిన రోడ్లే ఉన్నాయి. కనీసం మట్టి రోడ్డు వేసే పరిస్థితి లేదని అన్నారు. ఈ ఉప ఎన్నికలు 22వేల కోట్లకు తాకట్టు పెట్టినందుకు వచ్చాయని అన్నారు.

2014లో ఒకాయన, 2018లో ఒకాయన ఎమ్మెల్యే అయ్యారు. సారా పాతదే గాని సీస కొత్తది అన్నట్లు నమ్మినోళ్లను నట్టేట ముంచి వెళ్లిపోయాడు. అమ్ముడు పోవడానికి కూడా హద్దు ఉండాలని, రాజకీయ నాయకులంటే సంతలో గాడిదలకంటే అధ్వాన్నంగా అమ్ముడుపోతున్నారని, కనీస విలువలు లేకుండా పోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
పెద్దలు జీవన్‌రెడ్డి అన్నట్లు ఆ మనిషికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా.. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి పక్క పార్టీలోకి వెళ్లి కేసీఆర్‌తో కొట్లాడుతా అంటున్నాడు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలోకి వెళ్లి కేసీఆర్‌తో కొట్లాడుతా అంటే ఎట్లా సాధ్యమౌతుందని రేవంత్ ప్రశ్నించారు. ఈ సీటు బీజేపీ గెలిస్తే మూడు బోడి లింగాలకు ఒక బోడి లింగం జతవుతుంది అంతేనన్నారు.
నేను రాజగోపాల్‌రెడ్డిని ఒకటే అడుగుతున్నా మోడీ, అమిత్ షాల దగ్గర నాకు మస్తు పేరు ఉన్నదని చెప్పుకుంటున్నావు కదా ఇప్పటికైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమని అడగాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించిన డిండీ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.5000 కోట్లు ఇప్పించాలన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లాతో పాటు మునుగోడు నియోజక వర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు.

అలాగే మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో 16 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇందులో తెలంగాణ వాటా కింద 50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆ పని చేస్తే మునుగోడులో పది, ఇంటర్ పూర్తి చేసిన వారికి ఒకటి కాదు రెండు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇవన్నీ తెచ్చి మునుగోడు ప్రజలను ఓట్లు అడగాలన్నారు.
మూసీ ప్రాజెక్టు కలుషితమై ప్రజల్ని చంపుతుంటే మోదీ ఇటువైపు చూడలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ రూ. 1150 యాభై అయ్యింది. నాడు కేంద్రం సిలిండర్ ధర రూ.100 పెంచితే రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా ఆడబిడ్డలపై భారం పడకూడదని నాడు మంత్రిగా ఉన్న జీవన్‌రెడ్డి రూ.50 భరిస్తుందని చెప్పారు. అట్లా దీపం పథకం కింద ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఇప్పించి, వాళ్లకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించామన్నారు.
అంతేకాదు మోడీ హయాంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. అలాంటి మోడీని నమ్ముకుని ఇవాళ రాజగోపాల్‌రెడ్డి ఎన్నికలో ఓట్లు అడుగుతున్నాడు. ఇంకో ఆయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆయనేమీ కొత్త వ్యక్తి కాదు. నేను అడుగుతున్నా నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే తప్పా ఈ ఊళ్లో ఎవరికైనా డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చాయా ఈ ఊళ్లో దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా? చదువుకున్న యువతకు ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఎవరికైనా రైతు రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించారు.

కేసీఆర్ దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. 101వ గాడిద వచ్చినా గడ్డిమేస్తుంది తప్ప మీ సమస్యలు పరిష్కరించదని అన్నారు.ఇంత కాలం ఏమీ వెలగబెట్టని కేసీఆర్ ఈ ఆరు నెలల్లో ఏం చేస్తాడు. డిండి ప్రాజెక్టు కుర్చీ వేసుకుని కడతా అన్నాడు.. అది అక్కడ పోయింది. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు కూడా ఎనిమిదేళ్ల కాలంలో పూర్తి చేయలేదు.. చేస్తాడన్న నమ్మకం కూడా లేదన్నారు. కేసీఆర్ మాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడని రేవంత్ మండిపడ్డారు.
సామాన్యుల నడ్డి విరుస్తున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా?, ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు టీఆరెస్ కు ఓటు వేయాలా? ఎందుకు టీఆరెస్, బీజేపీలకు ఓటు వేయాలి? అని నిలదీశారు. ఈ బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక మీ ఆడబిడ్డకు ఒక అవకాశం ఇవ్వాలని, మీరే కథనాయకులై పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు. కన్న తల్లిని హత్య చేయడానికి బొడ్లో కత్తి పెట్టుకు తిరుగుతున్న రాజగోపాల్‌ను తరిమి కొట్టాలని అన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మీ ఉత్సాహాన్ని, మీ ఆదరణను చూస్తుంటే మునుగోడు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకుంటుందని, సోదరి స్రవంతి విజయం తథ్యమని అన్నారు. సాధారణ ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వస్తాయి. అలాంటిది మునుగోడు ఉప ఎన్నిక మూడున్న సంవత్సరాలకే ఎందుకు వచ్చిందన్నది మీరంతా ఆలోచన చేయాలన్నారు.

మీ ఆదరాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అర్ధాంతరంగా రాజీనామా చేసి నేను టీఆర్ఎస్‌తో కొట్లాడుతా అని చెప్పి బీజేపీలోకి వెళ్తున్నానన్నారు. రాజగోపాల్‌కు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఎంపీగా అవకాశం కల్పించింది. ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్రవంతి కాదని నీకు టికెట్ ఇస్తే మీరంతా ఆదరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించారు. ఈ ఎన్నిక రాజగోపాల్‌రెడ్డి అహంకారాన్ని, కేసీఆర్ అధికార మదానికి, మునుగోడు ప్రజల ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి మధ్య జరగబోతున్న ఎన్నిక అన్నారు. సోదరి స్రవంతికి మీ మద్దతు కావాలని, తనను గెలిపించాలని కోరారు.