Rahul Gandhi | క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్‌ పక్షాన నిలిచిందెవరు?

Rahul Gandhi | క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్‌ పక్షాన నిలిచిందెవరు?
  • తప్పుడు వాదనలతో చరిత్ర మారిపోదు

  • ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ కౌంటర్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోపై ముస్లింలీగ్‌ ముద్ర ఉందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. రాజకీయ వేదికలపై తప్పుడు వాదనలు చేసినంత మాత్రాన చరిత్ర మారిపోదని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలను సిద్ధాంతాల మధ్య ఘర్షణగా ఆయన అభివర్ణించారు.

‘దేశాన్ని ఐక్యం చేసిన కాంగ్రెస్‌ ఒకవైపు.. నిత్యం ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నవారు మరోవైపు ఉన్నారు’ అని బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడినదెవరో, దేశాన్ని చీల్చాలనుకున్న శక్తుల వెంట నిలిచినవారెవరో చరిత్రలో ఉన్నదని పేర్కొన్నారు.

క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్‌ పక్షాన నిలిచిందెవరు? ఇండియా జైళ్లన్నీ కాంగ్రెస్‌ నేతలతో నిండిపోయి ఉంటే.. దేశాన్ని విభజించే శక్తులతో రాష్ట్రాలను పాలిస్తున్నదెవరు? అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. రాజకీయ వేదికలపై తప్పుడు వాదనలు చేసినంత మాత్రాన చరిత్రమారిపోదని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న ముస్లింలీగ్‌ స్ఫూర్తితో తయారు చేసినట్టు ఉన్నదని ప్రధాని మోదీ పదే పదే విమర్శిస్తున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఈ కౌంటర్‌ ఇచ్చారు.

‘ప్రతి పేజీ ఇండియాను ముక్కలు ముక్కలు చేయాలన్నట్టు ఉన్నది. స్వాతంత్ర్యోద్యమం సమయంలో ముస్లిం లీగ్‌ ఆలోచనలను కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ప్రతిబింబిస్తున్నది. మిగిలంది ఏమన్నా ఉంటే.. అది లెఫ్టిస్టులది’ అని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.