నల్గొండ బరిలో నిలిచేదెవరు?.. కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై గందరగోళం

నల్గొండ బరిలో నిలిచేదెవరు?.. కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై గందరగోళం

తెరపైకి బీసీ వాదం

తానే పోటీ చేస్తానంటున్న కోమటిరెడ్డి

ఎటూ తేల్చుకోని కేడర్


విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయన పార్టీలో ట్రెండింగ్ లో ఉండే నేత. కొద్దికాలంగా ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా ఓ సెన్సేషన్ గా మారింది. ఇటీవల పార్టీలో బీసీ వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆ వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామంటూ చెప్పుకొచ్చారు. అంతలోనే ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.


నల్గొండ సెగ్మెంట్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ పార్టీ నేతలు, కేడర్ ను సందిగ్ధంలోకి నెట్టారు. మీడియాతో హాట్ హాట్ కామెంట్స్ చేసే కోమటిరెడ్డి, కొన్నిరోజుల కిందట నల్గొండ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తా, బీసీలకు పార్టీలో సముచిత స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటా అని వ్యాఖ్యానించారు.


అసలు నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సందేహాలు ఆయన అనుచరులు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలో ఆయన పోటీ చేయరని, కాంగ్రెస్ సీనియర్లను మరోసారి సిటింగ్ ఎంపీలను ఎంపీలుగానే పోటీ చేయించే అవకాశం ఉన్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేడర్లో ఆందోళన ప్రారంభమైంది.



తేలని ప్రత్యామ్నాయం


కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో స్పష్టత లేని కారణంగా పలు అనుమానాలు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో ఉన్నాయి. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయకపోతే, ఇక్కడ ప్రత్యామ్నాయం ఎవరనేది తేలాల్సి ఉంది. 2019 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన దుబ్బాక నరసింహా రెడ్డి, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ స్థానాన్ని కంచర్ల భూపాల్ రెడ్డికి కేటాయించడంతో అసహనానికి గురై, ఆ తర్వాత ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.


అయితే ఆయన కూడా పోటీకి సిద్ధంగా ఉండడం, తననే కాంగ్రెస్ అధిష్టానం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తుందని తన అనుచరులు, కార్యకర్తలకు చెప్పుకుంటూ వస్తున్నారు. కోమటిరెడ్డికి టికెట్ రాదనే విషయాన్ని పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దుబ్బాక నరసింహా రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీంతో నల్గొండ కాంగ్రెస్ కేడర్ ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడింది.


కార్యకర్తల్లో అయోమయం


సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగింది. సోదరుడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. ఆ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరున్ని గెలిపించాలంటూ కాంగ్రెస్ కేడర్ కి ఫోన్లో అభ్యర్థించిన అంశాలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి లేవనెత్తిన బీసీ వాదం ఇక్కడున్న బీసీ నేతల్లో ఆశలను రగిలించింది. దీంతో పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్న బీసీలు కూడా తమకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశపడ్డారు. తిరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకుని నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించినప్పటికీ క్యాడర్ నమ్మే పరిస్థితి లేదు.


నేతల గుర్రు..


నల్గొండలో పోటీ చేయాలనుకునే కోమటిరెడ్డి ఇక్కడ తనను నమ్ముకున్న కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకపోవడం వారిలో అసహనాన్ని రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండలో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి, వెంటనే నల్గొండ నుంచి మకాం మార్చి భువనగిరి ఎంపీగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలను, అభిమానులను, కేడర్ ను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్య అనుచరుడిగా ఉన్న బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆయనతో విభేదిస్తున్నారు. ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న దుబ్బాక నరసింహా రెడ్డి తన వర్గంతోనే ఉంటున్నారు.


ఇలా ఎంతోమంది కాంగ్రెస్ నేతలు పార్టీలోనే ఉంటూ కోమటిరెడ్డి పై గుర్రుగా ఉన్నారు. ఇక ఇప్పటివరకు నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భాలు కూడా అంతంత మాత్రమే. నియోజకవర్గంతో అంటీ ముట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి కార్యకర్తలకు అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పోటీ చేసే అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు కార్యకర్తలను పట్టించుకోవాలని కోరుతున్నారు.