అయిదు రోజుల పెళ్లి.. అదిరేటి పెళ్లి.. ఈ శ‌తాబ్ద‌పు వివాహం ఇదే!

ప్యారిస్‌ (Paris) లో జ‌రుగుతున్న ఓ పెళ్లిని ఈ శ‌తాబ్ద‌పు వివాహం (Marriage of Century) గా నెటిజ‌న్లు ప్ర‌క‌టించేశారు.

అయిదు రోజుల పెళ్లి.. అదిరేటి పెళ్లి.. ఈ శ‌తాబ్ద‌పు వివాహం ఇదే!

విధాత‌: ప్యారిస్‌ (Paris) లో జ‌రుగుతున్న ఓ పెళ్లిని ఈ శ‌తాబ్ద‌పు వివాహం (Marriage of Century) గా నెటిజ‌న్లు ప్ర‌క‌టించేశారు. ఆ వేడుక‌లో వెలుగు జిలుగులు, ఏర్పాట్లు, క‌ళ్లు చెదిరే దుస్తులు అన్నీ క‌నీవినీ ఎరుగ‌ని అట్ట‌హాసంగా ఉండ‌టంతో వారంతా అలా స్పందించారు. అయిదు రోజుల పాటు జ‌రిగిన ఈ వేడుక‌లో అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాకు చెందిన మ‌డేలైన్ బ్రాక్‌వే, ఆమె ప్రియుడు జాక‌బ్ లాగ్రోన్ ఒక‌ట‌య్యారు. న‌వంబ‌రు 18న ప్ర‌ధాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా ప్ర‌ఖ్యాత వెర్సాయిలెస్ ప్యాలెస్‌లోనూ కొన్ని కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.


బ్రాక్ వే ఈ మొత్తం వేడుక‌ను డాక్యుమెంట‌రీలా తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుండ‌టంతో నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. చాలా మంది దీనికి సంబంధించిన వీడియోల‌ను, ఫొటోల‌ను చూసి ఆశ్చ‌ర్య‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మ‌రికొంద‌రు నిజంగా ఈ వివాహానికి ఇంత ప్రాముఖ్యం అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. కాస్త అతి అనిపించేలా ఖ‌ర్చు పెట్టిన ఈ వివాహానికి సుమారు 449 కోట్లు (59 మిలియ‌న్ డాల‌ర్లు) ఖ‌ర్చు అయి ఉంటుంద‌ని అంచ‌నా.


ఇంత ఖ‌ర్చును ఎవ‌రు భ‌రించార‌ని ఈ పెళ్లి వీడియోల కింద‌న నెటిజ‌న్లు ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు. సంబంధిత వ‌ర్గాల ప్ర‌కారం.. ఈ ఖర్చును వ‌ధువు కుటుంబ‌మే పెట్టిన‌ట్లు తెలుస్తోంది. బ్రాక్‌వే తండ్రి బాబ్ బ్రాక్‌వే.. ఉసెరీ ఆటోమోటివ్ గ్రూప్‌కు ఛైర్మ‌న్‌, సీఈఓగా ఉన్నారు. ఆమె త‌ల్లి పౌలా బ్రాక్‌వే.. మెర్సిడ‌స్ బెంజ్ కంపెనీకి ఒక ప్రాంతంలో వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.


వివిధ ప్ర‌దేశాల్లో కార్య‌క్ర‌మాలు


బ్రాక్‌వే- జాక‌బ్ వివాహ వేడుక‌లు తొలుత ఉతాలోని కేనియ‌న్ పాయింట్ వ‌ద్ద ఉన్న అమ‌న్‌గిరి రిసార్టులో ప్రారంభ‌మ‌య్యాయి. అక్క‌డ వేడుక పూర్త‌య్యాక వారంతా ప్యారిస్ చేరుకున్నారు. వెర్సాయిలెస్ ప్యాలెస్‌లో కొన్ని కార్య‌క్ర‌మాలు చేసుకున్నారు. ఆ ప్యాలెస్‌లోనే ఉండే అత్యంత ఖ‌రీదైన లె గ్రాండ్ కంట్రోలే హోట‌ల్‌లో వ‌ధూవ‌రులు బ‌స చేశారు. ఇక్క‌డి గ‌దులు ఒక రాత్రికి రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.11 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటాయి. త‌ర్వాత ప్యారిస్ ఒపేరా హౌస్‌లో క‌ళ్లు చెదిరే డిన్న‌ర్‌ను ఏర్పాటు చేశారు.


డిన్న‌ర్ హాల్‌ను ప్ర‌పంచంలో అరుదుగా లభించే వంద ర‌కాల పూల‌తో అలంక‌రించారు. న‌వంబ‌రు 18న వీరి వివాహం జ‌రిగిన‌ప్ప‌టికీ ఆ లొకేష‌న్‌ను వారు బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే ఫొటోల్లో ఈఫిల్ ట‌వ‌ర్ క‌నిపిస్తోంది కాబ‌ట్టి ప్యారిస్‌లోనే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ భారీ హంగామా, ఖ‌ర్చు వ‌ల్లే కాకుండా నెటిజ‌న్ల మ‌ధ్య చ‌ర్చ వ‌ల్ల కూడా ఈ కార్య‌క్ర‌మం ట్రెండింగ్‌గా నిలిచింది. కొంత మంది త‌మ‌కు ఇది ఒక క‌ల అని వ్యాఖ్యానించ‌గా.. మ‌రికొంద‌రు. డ‌బ్బును చాలా రాచ‌రికంగా వృథా చేశారు అని పేర్కొన్నారు.