Telangana | ప్రజాప్రభుత్వాన్ని కూల్చేవారికి పరాభవమే!

అధికారం పోయిన తర్వాత నేతలు తమ రాజకీయ అవసరాల కోసమో, ఇతర ప్రయోజనాల కోసమో పార్టీ మారడం కొత్తేమీ కాదు. వింత అంతకంటే కాదు

  • By: Somu    latest    Mar 05, 2024 10:48 AM IST
Telangana | ప్రజాప్రభుత్వాన్ని కూల్చేవారికి పరాభవమే!
  • ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్‌ చెప్పడం వెనుక?
  • పార్టీని కాపాడుకునే యత్నమా? శ్రేణుల్లో భరోసా నింపడమా?
  • ఫిరాయింపులను ప్రజలు ఇంకా సహిస్తారా?


(విధాత ప్రత్యేకం)


అధికారం పోయిన తర్వాత నేతలు తమ రాజకీయ అవసరాల కోసమో, ఇతర ప్రయోజనాల కోసమో పార్టీ మారడం కొత్తేమీ కాదు. వింత అంతకంటే కాదు. ఎన్నికల సమయం కాబట్టి నేతలు పార్టీలు మారడం సహజమే. బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులు ఉద్యమకాలంలో అనేకం చూసింది. కనుక ఈ పరిణామాలతో ఆ పార్టీకి నష్టం జరుగుతుంది కావొచ్చు కానీ మొత్తానికే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమౌతుందనే ప్రచారంలా మాత్రం ఉండదు.


అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం, కాంగ్రెస్‌ పార్టీకి అధికారానికి అవసరమైన స్వల్ప మెజారిటీ మాత్రమే రావడం వంటివి రానున్నరోజుల్లో ఇక్కడ తాము ప్రత్యామ్నాయంగా ఎదగడానికి దోహదపడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినా ఆ పార్టీని చిత్తుగా ఓడించాలనేలా లేదన్నది ఫలితాలను బట్టి చూస్తే అర్థమౌతుంది.


ఫిరాయింపులు సరికాదు


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి 2018లో ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి ఆ సంఖ్య 90కి చేరింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు లేదా ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా నాటి ప్రభుత్వ వ్యవహరించడం వల్ల 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ప్రజలు ఇలాంటి పరిణామాలను సమర్థించలేదు. అందుకే పార్టీ ఫిరాయించిన వాళ్లలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లందరినీ మొన్నటి ఎన్నికల్లో ఓడించారు.


2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ చెప్పుకోవడం, ఆ పరిణామాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నా ప్రజలు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే చర్యలను ప్రజలు సహించలేకపోయారు. కానీ 2018లో మాత్రం 2014లో నాటి పరిణామాలనే పునరావృతం చేయడాన్ని తప్పుపట్టారు.


ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రజా తీర్పును గౌరవించాలి. వారి ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించి గత ప్రభుత్వ వైఫల్యాలనే తాము అనుసరిస్తామంటే అది ఆ పార్టీకే నష్టాన్నికలుగచేస్తుంది. ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఎవరు చేసినా ప్రజలు హర్షించరు. అలాంటి యత్నాలు చేసే వారికి బుద్ధి చెప్పారు. భవిష్యత్తులోనూ చెబుతారు. కానీ ప్రజలు ఇవేవీ పట్టించుకోరు. మేము చేసేదే చేస్తామని వ్యవహరిస్తే మాత్రం అది మొదటికే మోసం తెస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన విధానాలుండాలె.


కూల్చేదెవరు?


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు, బీజేపీ నేతలు ఈ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్నారు. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందనే మాటలు చెబుతున్నారు. తమ పార్టీని కాపాడుకోవడానికో లేదా రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకో ఈ మాట చెప్పి ఉండవచ్చు.


కానీ.. ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరు? దీనిపై స్పందించిన సీఎం ధీటుగానే సమాధానం ఇచ్చారు. అలాగే తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిరాయింపులపై మాట్లాడుతూ.. తామంతట తాము ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, కానీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎవరూ ఊహించలేరని స్పష్టం చేశారు.


కాబట్టి ఇతర పార్టీల నుంచి ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుంటే ప్రజల్లో కూడా ప్రభుత్వ తీరుపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అలా కాకుండా ఎన్నికల సమయంలో, అంతకు ముందు ఏమైనా మాట్లాడుతాం. అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాని కంటే తామేమీ తక్కువ కాదు అన్నట్టు తలుపులు బార్లా తెరుస్తామనే ఆలోచనతో ఉంటే ప్రజా వ్యతిరేకతను కోరి తెచ్చుకున్నవాళ్లు అవుతారు. ఎందుకంటేఅహంకారం, ప్రజల్లో లేకపోవడం, ప్రతిపక్షాలు ఉండకూడదనే ధోరణి, ప్రశ్నించకూడదనే వైఖరి ఇవన్నీ గత ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం.


ఈ విషయం నాడు విపక్ష నేతగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడిన రేవంత్‌రెడ్డికి ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి నుంచి వచ్చిన స్పందనలే. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి రాజకీయ విధానాలు ఆశిస్తున్నారు అన్న అంశాలే ప్రాతిపదికన పరిపాలన సాగించాలి. అప్పుడు ఒకవేళ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు ఎవరు ప్రయత్నం చేసినా ప్రజాక్షేత్రంలో వారికి పరాభవం తప్పదు.