Korivi Venugopal | కరీంనగర్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా: ప్రజామిత్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్
Korivi Venugopal | విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నట్లు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ చెప్పారు. శుక్రవారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుటుంబానికి కరీంనగర్ తో 150 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలం చెందాయని ఆయన అన్నారు. అందుకే తాను ప్రజల పక్షాన నిలిచేందుకు పోటీలో […]

Korivi Venugopal |
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నట్లు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ చెప్పారు. శుక్రవారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుటుంబానికి కరీంనగర్ తో 150 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలం చెందాయని ఆయన అన్నారు. అందుకే తాను ప్రజల పక్షాన నిలిచేందుకు పోటీలో వుంటున్నట్టు చెప్పారు.
బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలు అంతర్గతంగా ఒకటేనని ప్రజలకు అర్థమైంద న్నారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీకి సిద్ధం కావడంతో కరీంనగర్ లో గంగులకు బలమైన పోటీ అభ్యర్థులు లేరని అన్నారు. బలమైన పోటీని గంగుల కమలాకర్ కు ఇచ్చే సత్తా తనకు ఉందన్నారు.1997లో ప్రొఫెసర్ జయశంకర్, కాలోజీ నారాయణరావులను కరీంనగర్ కు తీసుక వచ్చి తెలంగాణ కోసం సదస్సులు ఏర్పాటు చేసానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యమాలతో సంబంధాలు కలిగి ఉన్నానని చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ లాకాలేజీ కార్యదర్శిగా, కరీంనగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఉద్యమాలకు నిలయమైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా, ఎనిమిది ముక్కలుగా మార్చి చీలికలు, పేలికలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ మండలాలను సైతం సిద్దిపేట జిల్లాలో కలుపుకొని జిల్లాలో ఉద్యమాలకు తావు లేకుండా చేశారని విమర్శించారు.
కరీంనగర్ జిల్లాను ఇన్ని ముక్కలుగా చేసినా ఇక్కడి ప్రతిపక్ష నాయకులు మాట్లాడలేదన్నారు. తాను మాత్రం అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రజల కోసం కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే సిద్దిపేట జిల్లాలో కలిపిన మూడు మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తానన్నారు. కరీంనగర్ జిల్లా ఉనికిని కాపాడేందుకే తాను బరిలో ఉంటున్నానని చెప్పారు. మీడియా సమావేశంలో బోయినపల్లి చంద్రయ్య, సిగిరి శ్రీధర్, చిలుకూరి రామ్మూర్తి, బాపురెడ్డి పాల్గొన్నారు.