PCC నేతలు చేతిలో చేయి వేస్తారా? రేవంత్‌రెడ్డి వెంట కలిసి నడుస్తారా?
సోమవారం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర నేతలతో రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే భేటీ విధాత: రాష్ట్ర కాంగ్రెస్ నేతల చేతులు కలుస్తాయా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. సోమవారం నుంచి రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టాలని పీసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే.. రాహుల్ గాంధీ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈ యాత్ర […]

- సోమవారం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర
- నేతలతో రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే భేటీ
విధాత: రాష్ట్ర కాంగ్రెస్ నేతల చేతులు కలుస్తాయా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. సోమవారం నుంచి రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టాలని పీసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే.. రాహుల్ గాంధీ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈ యాత్ర చేపడుతున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయడానికి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఇటీవలి కాలంలో నియమితులైన మరాఠా నాయకుడు మాణిక్ రావు ఠాక్రే చేపట్టారు.
ఆయన బాధ్యతలు తీసుకున్న తరువాత రాష్ట్ర పీసీసీ నేతల మధ్య ఎంత సఖ్యత ఏర్పడిందో తెలియదు కానీ బహిరంగ విమర్శలు చేయకుండా కాస్త బుద్ధిగానే ఉన్నారన్న వాతావరణం కనిపిస్తున్నది. ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సార్లు హైదరాబాద్‌కు వచ్చి నేతలతో భేటీ అయ్యారు.
ఈ నెల 6 తేదీ సోమవారం నుంచి ములుగు జిల్లాలో ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయడంపైనే దృష్టి సారించిన ఠాక్రే శనివారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇతర సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.
రేవంత్‌కూ చెల్లెమ్మ సెంటిమెంట్
దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి చెల్లెమ్మ సెంటిమెంట్ ఎక్కువ. అందుకే ఆయన అధికారంలోకి రాకముందు చేపట్టిన పాదయాత్రను తనకు అత్యంత ఇష్టమైన చేవెళ్ల చెల్లెమ్మగా పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డి ఆనాడు ప్రాతినిధ్యం వహించిన చేవెళ్ల నుంచి ప్రారంభించారు.
వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక కార్యక్రమాలను చేవెళ్ల నుంచే ప్రారంభించే వారు… తాజాగా రేవంత్‌రెడ్డికి తనకు ఇష్టమైన చెల్లెమ్మ సీతక్క ప్రాతినిధ్యం వహించే ములుగు నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీని ఒప్పించడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజయవంతమయ్యారు.
ఇప్పటికైతే సఖ్యతతోనే..
దాదాపు 60 రోజుల పాటు 50 నియోజకవర్గాల మీదుగా సాగే ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి నేతలంతా కలిసి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించారు. సీనియర్ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసే బాధ్యతను ఠాక్రే నెత్తికి ఎత్తుకున్నారు.
ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో సీనియర్ నేతలతో ఆయన వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే అంతా సఖ్యతతోనే కనిపిస్తున్నారు. మరి పాదయాత్ర మొదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.