Revanth Reddy | రెండు చోట్ల పోటీతో.. KCR ఓటమి ఒప్పుకున్నట్లే: రేవంత్‌రెడ్డి

Revanth Reddy | అభ్యర్థుల ప్రకటన మూహుర్తానికి లిక్కర్ దుకాణాల డ్రా తీసిన ఘనుడు సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజం రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్‌ విధాత: సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఇవ్వాలని, సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పోటీ చేయాలంటు కాంగ్రెస్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా, సిటింగ్‌లలో మార్పులు చేసి, రెండుచోట్ల పోటీకి సిద్ధపడి సీఎం కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేఖరులతో […]

  • By: krs    latest    Aug 21, 2023 1:46 PM IST
Revanth Reddy | రెండు చోట్ల పోటీతో.. KCR ఓటమి ఒప్పుకున్నట్లే: రేవంత్‌రెడ్డి

Revanth Reddy |

  • అభ్యర్థుల ప్రకటన మూహుర్తానికి లిక్కర్ దుకాణాల డ్రా తీసిన ఘనుడు
  • సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజం
  • రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్‌

విధాత: సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఇవ్వాలని, సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పోటీ చేయాలంటు కాంగ్రెస్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా, సిటింగ్‌లలో మార్పులు చేసి, రెండుచోట్ల పోటీకి సిద్ధపడి సీఎం కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ బీఆరెస్ అభ్యర్థుల జాబితా మూహుర్తానికి లిక్కర్ దుకాణాల డ్రా తీసిన ఘనుడని, దీంతో కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని రేవంత్ కోరారు. కేసీఆర్ విడుదల చేసిన బీఆరెస్ అభ్యర్థుల లిస్టు చూశాక రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అర్ధమైందన్నారు. 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.

కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటేనే ఆయన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లేన న్నారు. కేసీఆర్ ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడిస్తారన్నారు. కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉందని, కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం ద్వారా కేసీఆర్‌ మైనారిటీలను అవమానించడమేనన్నారు. ఈ విషయాన్ని మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారన్నారు.

లక్ష రుణమాఫీ అని చెప్పి 99,999 రుణమాఫీ అని లక్కీ నంబర్ చూపారని, దీంతో ఒక్క రూపాయి తేడాతో 20 లక్షల మంది రైతులు రుణమాఫీ దూరమవుతున్నారన్నారు. 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? అని ప్రశ్నించారు.

12500 గ్రామ పంచాయతీలు ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారని, ఆ గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? నీ చింతమడకలో బడి కట్టింది, నీ ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ కాదా అంటు ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని, జనసంద్రత ఉన్న జూబ్లీ బస్ స్టేషన్, కాచిగూడ, గౌలీగూడా లాంటి చోట్ల కాంగ్రెస్ మెట్రో రైలు వేసిందన్నారు.

భూముల విలువ పెంచుకునేందుకు ఔటర్ చుట్టూ కేసీఆర్ మెట్రో వేస్తున్నారని ఆరోపించారు. పేదలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ మెట్రో వేస్తే, రియల్ వ్యాపారం కోసం కేసీఆర్ మెట్రో విస్తరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని సిగ్గు లేకుండా అడుగుతున్నవా? ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన నీ జ్ఞానం అంటు రేవంత్ ఫైర్ అయ్యారు.

కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నానని, 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని, 23లక్షల కోట్లతో తెలంగాణలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చర్చిద్దాం రమ్మంటూ సవాల్ విసిరారు. పెన్షన్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ అని, రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీనేనన్నారు.

2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో నువ్వు ప్రత్యక్ష భాగస్వామివన్నారు. ఆ పాపాలకు కారణమైన నువ్వే పాపాల భైరవుడివంటు దుయ్యబట్టారు. 2004లో కాంగ్రెస్ తో, 2009లో టీడీపీతో, 2011లో బీజేపీ తో పొత్తు పెట్టుకుంది నీవు కాదా? అంటూ నిలదీశారు. మూడు పంటలు అంటున్న కేసీఆర్ రైతు బంధు రెండు పంటలకే ఎందుకు వేస్తున్నారంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తన తల్లిదండ్రుల పేర్లు తప్ప ఏదీ నిజం చెప్పరంటు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేం రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరుతామన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లని కేటీఆర్ ఐఆర్బీ నుంచి వచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు అమెరికా వెళ్లారని ఆరోపించారు. మందు, డబ్బు పంచకుండా ప్రజలను ఓట్లు అడిగేందుకు సిద్ధమా అన్నకేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, యాదగిరిగుట్టలో ప్రమాణం చేద్దామా, నాంపల్లి దర్గా వద్ద ప్రమాణం చేద్దామా? అంటూ ప్రశ్నించారు.

నిన్న సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి అవమానించారని, అమరవీరుల కుటుంబానికి కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేయడం కాదని, ముందుగా ఇక్కడ కేసీఆర్ ను ప్రశ్నించాలన్నారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ పై కమ్యూనిస్టులు పోరాటం చేయాలన్నారు.