వైసీపీ జాబితాపై అధిష్టానం జంకు?
నాలుగు జాబితాలతో 68 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ.. ఇంకా సీట్ల కసరత్తులోనే మునిగితేలుతోంది. అదిగో.. ఇదిగో అంటూ ఐదో జాబితాను పొడిగించుకుంటూ పోతోంది

– నియోజకవర్గాల్లో రగులుతున్న అసంతృప్తులు
– ఫలించని అధిష్టానం బుజ్జగింపులు
– టీడీపీ-జనసేన గూటికి నేతలు క్యూ
– రాజ్యసభ ఎన్నికలతో సీఎం జగన్ ఆచితూచి అడుగులు
విధాత: నాలుగు జాబితాలతో 68 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ.. ఇంకా సీట్ల కసరత్తులోనే మునిగితేలుతోంది. అదిగో.. ఇదిగో అంటూ ఐదో జాబితాను పొడిగించుకుంటూ పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ లో రగులుతున్న అసంతృప్తి జ్వాలలకు అధిష్టానం మరో జాబితాపై జంకుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి. ఈపరిణామాలతోనే ఐదో జాబితాపై సీఎం జగన్ తర్జనభర్జన పడుతున్నట్లు ఆపార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. టికెట్ల వేటలో ప్రజాప్రతినిధులు, నేతలు తరలివస్తుండడంతో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కిటకిటలాడుతుండగా… అదేస్థాయిలో అసంతృప్త నేతలు టీడీపీ, జనసేనతో టచ్ లోకి వెళ్తున్నారు. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ అసంతృప్తులను బుజ్జగించే వారి ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.
– ఐదో జాబితాపై కసరత్తు
వైసీపీ ఐదో జాబితాపై అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మార్పులు, చేర్పుల క్రమంలో ఆయా నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావహులు, పార్టీ సీనియర్ నాయకులను తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపిస్తున్నారు. మంగళవారం మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఉష శ్రీచరణ్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు తాడేపల్లిలోని సీఎంవో కార్యాలయానికి వచ్చారు. అధిష్టానం పెద్దలు వారితో విడివిడిగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
– అసంతృప్తిలో ‘ఆదిమూలం’
– హైదరాబాద్ లో నారాలోకేశ్ తో భేటీ
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది. అతనికి సిటింగ్ స్థానం సత్యవేడు కాదని.. తిరుపతి ఎంపీ సీటు ఇస్తున్నట్లు అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సిటింగ్ స్థానాన్ని నిరాకరించడంతో ఆదిమూలం భగ్గుమన్నారు. ఈక్రమంలోనే ఆయన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంలో రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది. తాజాగా ఆయన హైదరాబాద్ లో ప్రత్యక్ష్యమయ్యారు. కుమారుడితో కలసి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ను కలవడం ఆసక్తిగా మారింది. టీడీపీలో చేరే విషయమై నారా లోకేశ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అధికార వైసీపీలో అసంతృప్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా వైసీపీని వీడుతున్నట్లు స్పష్టమవుతోంది.
– బాలినేని ఎపిసోడ్ వైసీపీకి షాకిచ్చేనా?
ఒంగోలు వైసీపీలో ముసలం కొనసాగుతోనే ఉంది. ఒంగోలు ఎంపీ టికెట్ పేచీని తెంచడంలో అధిష్టానం విఫలమైనట్లు తెలుస్తోంది. ఆజిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టికెట్ల కేటాయింపుపై తొలినుంచి విభేదిస్తున్నారు. ఈక్రమంలో ఒంగోలు ఎంపీ సీటు కేటాయింపు ఆయన్ను పార్టీకి మరింత గ్యాప్ పెంచింది. ఈ టికెట్ ను మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలంటూ పట్టుబడుతున్న బాలినేని.. పలుసార్లు సీఎం జగన్ తో పాటు అధిష్టానం పెద్దలతో చర్చించారు. అయినా ఒంగోలు టికెట్ కేటాయింపుపై స్పష్టత రాకపోయింది. ఈనేపథ్యంలో తాజాగా మంగళవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి విజయవాడలోని ఓ హోటెల్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా బాలినేనిని బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్లు ఆపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అధిష్టానంతో తీవ్రంగా విభేదిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. మాగుంటలకు సీటు లేదని అధిష్టానం తేల్చిచెప్పడంతోనే బాలినేని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలు స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నట్లు సంకేతాలు రావడంతో.. బాలినేని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.
– జనసేన ముహూర్తం ఖరారు చేసుకున్న బాలశౌరి
మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి అనుకున్నట్లుగానే జనసేన గూటికి చేరనున్నారు. ఇప్పటికే ఆపార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని బాలశౌరి నిర్ణయించినట్లు సమాచారం. బాలశౌరికి జనసేనలో ఎంపీ సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిని తీవ్రంగా విభేదించిన బాలశౌరి.. చివరకు సిటింగ్ స్థానాన్ని కోల్పోవడంతో పాటు వైసీపీకి దూరం కావాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలకు మచిలీపట్నం సీటును తనకు తెలియకుండానే మరొకరికి కేటాయించారంటూ ఆగ్రహంతో ఉన్న బాలశౌరి.. పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు.
– ఢిల్లీ టూర్ కు సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీ టూర్ ఫిక్స్ అయినట్లు ఆపార్టీ వర్గాల సమాచారం. ఇది అధికారిక పర్యటన కాదని, పూర్తిస్థాయి రాజకీయ పర్యటనగా పేర్కొంటున్నారు. బీజేపీతో దోస్తీ కోసమే జగన్ ఢిల్లీ టూర్ అంటూ ప్రతిపక్షాలు మరోవైపు సెటైర్లు వేస్తున్నారు. కాగా సీఎం జగన్ రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్తారని, తన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీకి సహకరిస్తే బీజేపీకి ఒక రాజ్యసభ సీటును ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.