Delhi | ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విషాదం.. వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
దేశరాజధాని సెంట్రల్ ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర విషదాన్ని మిగిల్చింది

మృతుల్లో తెలంగాణ విద్యార్థిని
విధాత, హైదరాబాద్ : దేశరాజధాని సెంట్రల్ ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర విషదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో సివిల్స్ కోచింగ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన తానియా సోని (25), యూపీకి చెందిన శ్రేయా యాదవ్ (25), కేరళకు చెందిన నెవిన్ డాల్విన్ (28)లు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తింది. దీంతో అందులో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీటమునిగారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది 30 మందిని రక్షించగా, ముగ్గురు మరణించారు.
శనివారం రాత్రి 7.15 గంటలకు ఓల్డ్ రాజిందర్ నగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు సమాచారం వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. 10-12అడుగుల మేరకు సెల్లార్లో ఒక్కసారిగా వరద నీరు చేరిందన్నారు. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని, అప్పటికే బేస్మెంట్ మొత్తం నీటితో నిండి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై క్రిమినల్ కేసు నమోదుచేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారి హర్షవర్ధన్ చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ, జల్ బోర్డు మంత్రి అతిశీ.. సీఎస్ నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన రావూస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వం తీరుపై నిరసన
సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది. ఘటన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్‌కు తెలియజేశామని పేర్కొన్నారు. వారు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్ ఘటనా ప్రాంతానికి వెళ్లారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వాతిమాలివాల్‌పై మండిపడ్డారు. విషయాన్ని రాజకీయం చేయవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. అయితే కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో.. మిగతా విద్యార్థులు స్వాతిమాలివాల్ ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
ఈ ఘటనపై దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, నేనూ ఇక్కడికి వచ్చామని, డ్రైనేజీ ఒక్క సారిగా పైకి ఉబికి వచ్చిందని స్థానికులు చెప్పారు. ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాలకు విరుద్ధంగా బేస్మెంట్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ దిల్లీ ప్రభుత్వంపై మండిపడ్డారు. డ్రెయిన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదేపదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ జల్ బోర్డు మంత్రి అతిశీ, దుర్గేష్ పాఠక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.