Chhattisgarh Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృత్యువాత..

Chhattisgarh Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృత్యువాత..

Chhattisgarh Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. దుర్గ్‌ జిల్లా ఖాప్రి సమీపంలో బస్సు బోల్తాపడిన ఘటనలో 15 మంది దుర్మరణం చెందారు. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఓ డిస్టిలరీ సంస్థకు చెందిన ఉద్యోగులుగా గుర్తించారు. కంపెనీలో విధులు ముగించుకొని.. కంపెనీ బస్సులో ఇండ్లకు తిరిగి వెళ్తుండగా మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. బస్సు 40 అడుగుల వరకు ఉన్న భారీ గుంతలో పడడంతో సంఘటనా స్థలంలోనే 11 మంది మృతి చెందారని దుర్గ్‌ ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు.

మిగతా వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సిటీ ఎస్పీ హరీష్‌ పాటిల్‌ తెలిపారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రి తరలించినట్లు పేర్కొన్నారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ క్షతగ్రాతులకు మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కంపెనీ రూ.10లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని కేడియా డిస్టిలరీ కంపెనీ ప్రకటించింది. క్షతగాత్రులందరినీ ఎయిమ్స్‌, అపెక్స్‌ ఓం, ఇతర ఆసుపత్రుల్లో చేర్పించినట్లు పేర్కొంది. ప్రమాదం జరిగిన ప్రమాదంలో అంతా చీకటిగా ఉండడంతో టార్చ్‌లు, మొబైల్‌ ఫోన్ల వెలుతురులో సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలుంటాయని డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ తెలిపారు.