Weather | ఢిల్లీని వణికిస్తున్న చలి..! దట్టంగా కమ్మేసిన పొగమంచు..!
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. దాంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేసింది

Weather | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. దాంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంగళవారం ఉదయం ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో పొగ మంచు కమ్ముకున్నది. పాలెం విమానాశ్రయంలో ఉదయం 7 గంటలకు విజిబిలిటీ 100 మీటర్లు, సఫ్దర్‌జంగ్ వద్ద 50 మీటర్లుగా నమోదైంది. ఉదయం 5.30 గంటలకు సఫాడ్‌జంగ్ ప్రాంతంలో 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, మరోవైపు పాలెం ప్రాంతంలో ఉష్ణోగ్రత 7.2 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. గత సోమవారం ఉదయం ఢిల్లీలో సీజన్‌లో అత్యంత శీతల దినంగా రికార్డయ్యింది. చలిగాలుల మధ్య ప్రజలు చలి నుంచి తప్పించుకునేందుకు మంటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
చాలా మంది ప్రయాణికులు తమ లగేజీతో విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. తాను వెళ్లాల్సిన విమానం ఉదయం 8.40 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. పొగమంచు కారణంగా ఆలస్యమవుతుందని చెప్పారని ఓ ప్రయాణికి తెలిపాడు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అడ్వైజరీ జారీ అయ్యింది. విమానాశ్రయంలో దృశ్యమానత తక్కువగా ఉందని.. అన్ని విమానాలు యథావిధిగా నడుస్తాయని.. ప్రయాణీకులందరూ ఇండ్ల నుంచి బయలుదేరే సమయంలో మొదట సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను ఆశ్రయించాలని సూచించాయి. మరోవైపు పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండడంతో ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గత సోమవారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 19.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా 3.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదివారం కంటే 0.2 డిగ్రీలు తక్కువ. రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజంతా తేలికపాటి చలి గాలులు వీస్తూనే ఉన్నాయి. ఫలితంగా పగటిపూట సైతం చలి కొనసాగుతున్నది. రానున్న రోజుల్లో ఉదయం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలోని లోడి రోడ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం అత్యంత చలిగా ఉంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 3.1 డిగ్రీలుగా నమోదైంది. మంగళవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ వివరించింది.