ఫిబ్రవరి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌!

దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ‌తోపాటు, ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఏప్రిల్ 16 లోగా పూర్తి చేయాల‌ని భార‌త‌ ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాదించింది

ఫిబ్రవరి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌!
  • ఎన్నిక‌ల ప్రక్రియ కోసం తాత్కాలిక పోల్‌ డేట్‌
  • ఏప్రిల్‌ 16ను దృష్టిలో ఉంచుకుని పనులు
  • రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యులర్‌

న్యూఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ‌తోపాటు, ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఏప్రిల్ 16 లోగా పూర్తి చేయాల‌ని భార‌త‌ ఎన్నిక‌ల సంఘం భావిస్తున్నది. ఈ మేరకు తాత్కాలిక పోల్‌ డేట్‌గా ఏప్రిల్‌ 16ను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని వివిధ రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు ఈసీ జనవరి 19న ఒక సర్క్యులర్‌ పంపింది. ప్రారంభ‌, ముగింపు ప్రక్రియ‌కు ఏప్రిల్‌ 16 ప్రాతిపదికగా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నది. దీని ప్రకారం చేస్తూ ఫిబ్రవరి రెండో వారంలోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి.


హడావుడిగా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా ప్రజలను రామనామ స్మరణలో మునిగేలా చేసి, ఆ పేరుతో ఓట్లు దండుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇంకా నిర్మాణం పూర్తికాని ఆలయంలో హడావుడిగా ప్రాణప్రతిష్ఠ చేయించారని అంటున్నారు. ప్రాణప్రతిష్ఠ ఆలస్యమైతే ఎన్నికల కోడ్‌ ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోనే ముందుగానే ముహూర్తం పెట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ ఎన్నికల రణభేరికి సంకేతంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. గతంలో మాదిరిగా సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ ఈసారి ఉండే అవకాశాల్లేవని తెలుస్తున్నది. మార్చి నెలలోనే మూడు విడతలూ పూర్తయ్యేలా ఏర్పాట్లు ఉండబోతున్నట్టు సమాచారం.

ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను సిద్ధం చేసుకోవడంతోపాటు.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ, సిబ్బంది వ్య‌వ‌హారాలు, బందోబ‌స్తు తదితర కార్య‌క‌లాపాల‌న్నీ ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి సన్నద్ధతకు కోసమే ఈ సర్క్యులర్‌ జారీ చేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్లానర్‌ను సిద్ధం చేసుకోవడానికి ఈ తేదీ ఆయా రాష్ట్రాల కమిషన్లకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. అన్నివిషయాల్లోనూ సంసిద్ధమైన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని వివరణ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10 ప్రకటన వెలువరించింది. ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకూ ఏడు దశల్లో ఓటింగ్‌ నిర్వహించారు. ఫలితాలను మే 23న ప్రకటించారు.