ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లే
‘పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనూ ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయం

– తెలంగాణలో బీజేపీకి 8 నుండి 12 సీట్లు పక్కా
– ఢిల్లీ ఓటూ పువ్వు గుర్తుకే..
– తెలంగాణ సర్కార్ వద్ద జీతాలివ్వడానికే డబ్బుల్లేవ్
– హామీల అమలు దేవుడెరుగు
– బీజేపీ జాతీయ నేత, ఎంపీ బండి సంజయ్
విధాత బ్యూరో, కరీంనగర్: ‘పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనూ ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయం. పొరపాటున ఎవరైనా బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే నివేదికలు చూసినా 80 శాతానికిపైగా ప్రజలు మోదీనే మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈసారి ఢిల్లీ ఎన్నికలకు(పార్లమెంట్) వేసే ఓట్లన్నీ పువ్వు గుర్తుకేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ బీజేపీ 8 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా పైసల్లేవన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు సీఎం, మంత్రులు కొత్తగా ఇస్తున్న హామీల అమలు దేవుడెరగని చెప్పారు. మంగళవారం కరీంనగర్ లోని శుభమంగళ గార్డెన్స్ లో బీజేపీ మండలాధ్యక్షులతోపాటు కొత్తగా ఎంపిక చేసిన మండల ఇన్చార్జిల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందన్నారు.
ఈసారి బీజేపీకి సొంతంగా 350 స్థానాలు రాబోతున్నాయని చెప్పారు. ఎన్డీఏ కూటమి 4 వందలకుపైగా సీట్లు సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ లేని భారత్ ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదన్నారు. గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ ఎంపీలు గెలిచినా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉండదన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రావాలంటే బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఉద్యోగుల జీతాల చెల్లింపులకు కూడా పైసల్లేని పరిస్థితి ఏర్పడిందని, దీంతోఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడం కష్టసాధ్యమన్నారు.
కొత్త మంత్రులు ఎవరికి వారే కొత్త హామీలిస్తున్నారని, వాటిని ఎలా అమలు చేయాలో తెలియక సీఎం సతమతమవుతున్నారని తెలిపారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కన్పించడంలేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి సీహెచ్ విఠల్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇంచార్జిలు మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, కరీంనగర్, రాజన్న జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.