ధరిత్రిపై అతిపెద్ద స్కాం ఎలక్టోరల్ బాండ్లు: కోజికోడ్ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ
ఎలక్టోరల్ బాండ్లు ఈ ధరిత్రిపైనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. అంత పెద్ద కుంభకోణాన్ని సమర్థించుకునేందుకు ప్రధాని మోదీ

వ్యాపారుల నుంచి వేల కోట్లు గుంజిన బీజేపీ
దేశాన్ని నడిపించే అవగాహన లేని మోదీ
కొవిడ్‌తో చస్తుంటే చప్పట్లు కొట్టమన్నారు
వేరొకరు అదే చెబితే తన్ని జైల్లో వేసేవారు
కోజికోడ్: ఎలక్టోరల్ బాండ్లు ఈ ధరిత్రిపైనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. అంత పెద్ద కుంభకోణాన్ని సమర్థించుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం కేరళలోని కోజికోడ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘సోమవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థకు మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ మీలో ఎవరన్నా చూశారో లేదో నాకు తెలియదు. ‘భారత దేశ వ్యాపారుల నుంచి వేల కోట్ల రూపాయలను బీజేపీ బలవంతంగా వసూలు చేసిన ఈ ధరిత్రిలోనే అతిపెద్ద కుంభకోణాన్ని సమర్థించుకునే క్రమంలో ఆయన ముఖం, ఆయన హావభావాలు మీలో ఎవరన్నా చూశారో లేదో నాకు తెలియదు’ అని రాహుల్ అన్నారు. రాజకీయాల్లో నల్లధనాన్ని ప్రోత్సహిస్తుందంటూ ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్లను మోదీ సోమవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్థించుకున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాన్ని నడిపించడంలో మోదీకి ఉన్న రాజకీయ అవగాహనను సైతం రాహుల్ ప్రశ్నించారు. ‘జనం కొవిడ్‌తో చనిపోతుంటే.. ప్రధాని మంత్రి మాత్రం చప్పట్లు కొట్టండి అంటారు.
మీడియా ఆయనను గొప్ప మేధావిగా కీర్తిస్తుంటుంది. అటువంటి సమయంలో మామూలు వ్యక్తులు ఎవరన్నా చప్పట్లు కొట్టండి.. అని అంటే.. అతడిని పట్టుకుని కర్రలతో మోది.. జైల్లో పడేసేవారు. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? ఎలాంటి వ్యక్తి దేశాన్ని నడిపిస్తున్నాడో? ఇదీ ఈనాడు ప్రభుత్వం పరిస్థితి’ అని రాహుల్ చెప్పారు. దేశాన్ని నడిపించడంపై మోదీకి ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. తమ మ్యానిఫెస్టోను చదవాలని ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. దేశ సమగ్ర పరివర్తనకు, దేశాన్ని విప్లవాత్మక పద్ధతుల్లో మార్చేందుకు ఉద్దేశించిన పత్రమని ఆయన అభివర్ణించారు. ‘దీని తర్వాత బీజేపీ మ్యానిఫెస్టోను చదవండి. వాళ్ల ప్రధానమైన రెండు అంశాలు ఏమిటంటే.. ఒకటి భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం, రెండోది చంద్రునిపైకి మనిషిని పంపడం’ అని అన్నారు.