డేట్‌ ఆఫ్‌ బర్త్‌గా ఇక ఆధార్‌ చెల్లదు..! ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం..!

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధార్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది

డేట్‌ ఆఫ్‌ బర్త్‌గా ఇక ఆధార్‌ చెల్లదు..! ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం..!

Aadhaar | కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధార్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్‌ చెల్లుబాటును నిలిపివేసింది. ఇకపై ఆధార్‌ను గుర్తింపు పత్రంగానే పరిగణించాలని, జనన ధ్రువీకరణగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 16న ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఈ నెల 16న సర్క్యులర్‌ను జారీ చేసింది. సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ గురువారం ఆమోదముద్ర వేశారు. ఉడాయ్‌ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో పేర్కొంది.

ఆధార్‌ను డే ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌గా గుర్తించలేమని పలు కేసుల్లో ఇటీవల న్యాయస్థానాలు తీర్పును వెలువరించాయి. ఈ క్రమంలో ఆధార్‌లోని డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా పుట్టిన తేదీల్లో మార్పులు చేయలేమని ఈపీఎఫ్‌తో స్పష్టం చేసింది. ఆధార్‌కు బదులుగా 10వ తరగతి సర్టిఫికేట్‌ను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. లేదంటే ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన మార్క్ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ ద్వారా సైతం పుట్టిన తేదీలో మార్పులు చేసుకోవచ్చని తెలిపింది.

సివిల్ సర్జన్ జారీ చేసిన ధ్రువీకరణపత్రాన్ని సైతం జారీ చేసి ఉంటే.. అందులో పుట్టిన తేదీని పేర్కొన్నట్లయితే దాన్ని సైతం గుర్తించనున్నట్లు పేర్కొంది. వాటితో పాటు పాస్‌పోర్ట్‌, పాన్‌ నంబర్‌, నివాస ధ్రువీకరనపత్రం, పెన్షన్‌ పత్రానికి సైతం గుర్తింపు ఉంటుందని పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. ఆధార్‌కార్డును గుర్తింపు కార్డుగా, నివాస ధ్రువీకరణపత్రంగా మాత్రమే ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పును వెలువరించింది. 

2018లో సుప్రీంకోర్టు ఆధార్ కార్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించకూడదో సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, సీబీఎస్‌ఈ, నిఫ్ట్‌, కళాశాలలు మొదలైన సంస్థలు, పాఠశాలలో అడ్మిషన్‌కు ఆధార్ నంబర్‌ను ఉపయోగించడం అవసరం లేదని చెప్పింది.

పిల్లల ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోవడమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తిరస్కరించడానికి కారణం కాదని.. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ కార్డు అగడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పుపై సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది తీర్పు చారిత్రాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయమన్నారు. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ కార్డును డిమాండ్ చేయలేవని.. బ్యాంకులు, టెలీకాం సంస్థలు ఆధార్ కార్డును కోరడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.