కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌.. మాజీ ఎంపీ రాజీనామా

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 55 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ‌లందించిన మాజీ ఎంపీ మిలింద్ దేవ‌రా రాజీనామా చేశారు

కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌.. మాజీ ఎంపీ రాజీనామా

ముంబై : మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 55 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ‌లందించిన మాజీ ఎంపీ మిలింద్ దేవ‌రా రాజీనామా చేశారు. ఈ మేర‌కు అధికారికంగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు మిలింద్ దేవ‌రా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. పార్టీతో 55 ఏండ్లుగా కొన‌సాగుతున్న బంధానికి నేటితో ముగింపు ప‌లుకుతున్న‌ట్లు తెలిపారు. ఇన్నేండ్లుగా పార్టీ నుంచి త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మిలింద్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

2004, 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సౌత్ ముంబై నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో శివ‌సేన నేత అర‌వింద్ సావంత్(శివ‌సేన యూబీటీ) విజ‌యం సాధించారు. అయితే కూట‌మిలో భాగంగా సౌత్ ముంబై నియోజ‌క‌వ‌ర్గం సీటును శివ‌సేన వ‌దులుకునే ఛాన్స్ లేదు. ఈ నేప‌థ్యంలో మిలింద్‌కు ఆ స్థానం ద‌క్కే అవ‌కాశం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే మిలింద్ దేవ‌రా షిండే ఆధ్వ‌ర్యంలోని శివ‌సేనలో చేరే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీలో ఆయ‌న‌కు టికెట్ ఇస్తార‌నే గ్యారెంటీ లేదు. సౌత్ ముంబై నుంచి బీజేపీ అభ్య‌ర్థి పోటీలో దిగే అవ‌కాశం ఉంది. అయితే మిలింద్‌కు రాజ్య‌స‌భ సీటును సీఎం షిండే ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ముర‌ళీ దేవ‌రా కుమారుడే మిలింద్ దియోరా.