తృణ ధాన్యాల (మిల్లెట్ల) పిండిపై జీఎస్టీ తగ్గింపు: నిర్మలా సీతారామన్

విధాత : తృణ ధాన్యాల (మిల్లెట్స్) పిండిపై జీఎస్టీ 18 నుంచి ఐదు శాతానికి తగ్గించినట్లుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్మలా అధ్యక్షతన శనివారం నిర్వహించిన జీఎస్టీ 52వ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అయితే ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్డ్ మిల్లెట్స్ పిండిపై ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుందని, కనీసం 70శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా విక్రయించితే ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపారు.
పౌష్టికాహార వస్తువులు ప్రజలకు తేలిగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు మిల్లెట్స్ పిండిపై జీఎస్టీ రేటు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.కౌన్సిల్ నిర్ణయాలలో మరికొన్ని పరిశీలిస్తే డిస్టిల్డ్ ఆల్కాహాల్‌ను పరోక్ష పన్నును మినహాయించారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్ (ఈఎన్ఏ)పై మాత్రం జీఎస్టీ యధావిధిగా కొనసాగుతుంది. చెరకు రైతులకు త్వరితగతిన బకాయిలు చెల్లించడానికి వీలుగా మొలాసిస్‌పై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించేసింది.
భారతీయ రైల్వేస్ సరఫరా చేసే వస్తు సేవలపైనా పన్ను విధించాలని ప్రతిపాదించింది. వాటర్ సప్లయ్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ కన్జర్వెన్సీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ స్లమ్ ఇంప్రూవ్ మెంట్ తదితర సర్వీసులపై పన్ను మినహాయించారు. జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడి పదవీ కాలం 67 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు, ట్రిబ్యునల్ సభ్యుల పదవీ కాలం 65 ఏండ్ల నుంచి 67 ఏండ్లకు పెంచుతూ కౌన్సిల్ తీర్మానించింది. కంపెనీల డైరెక్టర్లు అందించే కార్పొరేట్ గ్యారంటీపైనా జీఎస్టీ మినహాయించారు.