ఎగ్జిట్‌పోల్స్‌ నిజమయ్యేది ఎంత? ఇండియా కూటమి ఎందుకు తిరస్కరిస్తున్నది? ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ రాజకీయ వ్యూహాలే

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు అనుకూలంగా వచ్చిన పార్టీ ఒకరకంగా రాని పార్టీ దానికి విరుద్ధంగా స్పందించడం సహజమే. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎగ్జిట్‌పోల్స్‌ను ఇండియా కూటమి విశ్వసించకపోవడానికి కారణాలు చెబుతున్నారు

ఎగ్జిట్‌పోల్స్‌ నిజమయ్యేది ఎంత? ఇండియా కూటమి ఎందుకు తిరస్కరిస్తున్నది? ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ రాజకీయ వ్యూహాలే

(విధాత ప్రత్యేకం)
ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు అనుకూలంగా వచ్చిన పార్టీ ఒకరకంగా రాని పార్టీ దానికి విరుద్ధంగా స్పందించడం సహజమే. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎగ్జిట్‌పోల్స్‌ను ఇండియా కూటమి విశ్వసించకపోవడానికి కారణాలు చెబుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ మీడియా వ్యవహారాల ఛైర్‌ పర్సన్ పవన్ ఖేరాలు కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన అంకెలపై సందేహాలు వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ మాట్లాడుతూ రాజస్ధాన్‌లో 25 స్థానాలుంటే అక్కడ ఒక సర్వే సంస్థ 33 సీట్లు ఇచ్చిందని అది ఎట్లా సాధ్యమౌతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే బీహార్‌లో ఎల్జేపీ 5 స్థానాల్లో పోటీ చేస్తే ఎగ్జిట్‌పోల్స్‌ ఆ పార్టీకి 6 సీట్లు వస్తాయని చెప్పడం, తమిళనాడులో బీజేపీకి వచ్చే ఓట్ల శాతం, సీట్లపై సర్వే సంస్థలు ఇచ్చినవి నమ్మశక్యంగా ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. సర్వే సంస్థలకు చెందిన వేలాదిమంది వృత్తి నిపుణులను తప్పుపట్టాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఎందుకంటే గతంలో సర్వే సంస్థల అంచనాలకు దగ్గర వచ్చినవీ ఉన్నాయి. దానికి భిన్నంగా వాస్తవ ఫలితాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎగ్జిట్‌పోల్స్‌పై భిన్నాభిప్రాయాలు, సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రాజకీయ అభిప్రాయాలే గానీ నిపుణుల ఫలితాలు కావని, వాస్తవ ఫలితాలు మరికొన్ని గంటట్లో తేలుతాయని రాజకీయ నేతలతోపాటు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరి ధీమా వారిదే
ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీఏ వైపే ఉన్నాయి. వీటిని ఇండియా కూటమి నేతలు అంగీకరించరించడం లేదు. గతంలో వలె మోదీ పోలింగ్‌ చివరి దశ సమయంలో ముందు ధ్యానం చేయడానికి వెళ్లారు. ఆయన బహిరంగంగా మాట్లాడకుండా ఎక్స్‌ ద్వారానే స్పందిస్తున్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి రికార్డుస్థాయిలో మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. కానీ ఇండియా కూటమిలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ సహా అంతా మీడియా తోనే నేరుగా చెబుతున్నారు. ఇండియా కూటమి 295 సీట్లు గెలువబోతున్నదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధాని అభ్యర్థి ఎవరూ అన్న విషయంపై కూడా ఇండియా కూటమి నేతలు స్పష్టత ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ఎగ్జిట్‌పోల్స్‌పై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ఫలితాలపై మేం ఆశాభావంతో ఉన్నామని జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నామన్నారు. ఆ రోజు వరకు వేచి చూద్దామన్నారు.

ఆ సార్వత్రిక ఎన్నికల్లో అంచనాలకు దగ్గరగా..
1998 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కచ్చితంగా అంచనా వేశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని చెప్పాయి. అవి నిజమయ్యాయి కూడా. అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల మార్పు కోరుకుంటున్నారని అని కచ్చితంగా చెప్పగలిగాయి. అలాగే 2019 సార్వత్రిక ఫలితాల్ని అన్ని సంస్థలూ దాదాపు దగ్గరగా అంచనా వేశాయి. వాటి అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. 2021లో కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారం దక్కించుకుంటుందని చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకూ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేశాయి. కేరళ, బెంగాల్‌, అసోం రాష్ట్ర ప్రభుత్వాల పట్లా అక్కడి ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేకపోవడం, మిగిలిన రాష్ట్రాల్లో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు దగ్గరగా ఉండటానికి కారణం ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికారపార్టీ పట్ల వ్యతిరేకత, విపక్ష పార్టీల పట్ల ఉన్న సానుకూలత కారణం. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు ఫలితాలకు ముందే కొంత స్పష్టత ఉంటుంది. ప్రచార సమయంలోనే నేతలకు కొన్ని వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. కానీ చివరి నిమిషం వరకు పోరాడుతారు. లోపాలను తెలిసినా గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఫలితాల అనంతరం చాలా విషయాలు ఓటమికి గల కారణాలు చెబుతుండటం మనం చూస్తున్నదే.

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తలకిందులు
ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. బీహార్ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జేడీయూ – ఆర్జేడీ కూటమిగా బరిలో దిగాయి. ఈ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేల్చాయి. అయితే దానికి విరుద్ధంగా జేడీయూ – ఆర్జేడీకి బీజేపీ కూటమి గెలువబోతున్నదని ఓ జాతీయ మీడియా ప్రఖ్యాత జర్నలిస్టులు తమ అంచనాలను ఆర్జేడీ అధినేత లాలూ దగ్గర ప్రస్తావించారు. దీనికి ఆయన స్పందిస్తూ మేము ప్రచారంలో వేలాదిమంది పార్టీ శ్రేణులు, లక్షలాదిమంది ప్రజలను దగ్గరగా చూశాం. సర్వే సంస్థలు సేకరించే శాంపిల్స్‌ ఎన్ని ఉంటాయి? వాటి ఆధారంగానే ఎలా అంచనా వేస్తారు? అన్నారు. తమ కూటమికి 190 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అంచనాకు దగ్గరగానే 178 సీట్లు ఆర్జేడీ – జేడీయూ కూటమి గెలుచుకోవడం గమనార్హం. అలాగే 2017 యూపీ ఎన్నికలు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడుతుందన్నాయి. కానీ బీజేపీ 202 స్థానాలు అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2017 పంజాబ్ ఎన్నికల్లో మెజార్టీ సర్వే సంస్థలన్నీ ఆప్‌దే పీఠం గట్టిగా చెప్పాయి. కానీ, 77 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు సంస్థలు ఆర్జేడీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇచ్చాయి. కానీ, బీజేపీ – జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చింది.

చరిత్ర పునరావృతమవుతుందా? మోదీ 3.0 వస్తుందా?
ఇలా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు అన్నిసార్లు నిజం కాలేదు. విఫలం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికలపై అంచనా వేస్తున్న వాళ్లు ప్రజలు బీజేపీ తమకు ఓట్లు రాలుస్తాయని ప్రచారం చేసిన అంశాల కంటే స్థానిక అంశాలు, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వంటివి ప్రభావం చూపిస్తాయని వివిధ దశల పోలింగ్‌ సరళి ఆధారంగా చెబుతున్నారు. మూడోసారి మోదీ నేతృత్వంలో ఎన్డీఏ విజయం తథ్యం అనేవాళ్లూ ఉన్నారు. అలాంటిదేమీ లేదని 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ గెలుపు చూసి ఎనిమిది నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి వాజపేయ్‌ ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ప్రతి ఎగ్జిట్‌పోల్ ఎన్డీయేకు అద్భుత మెజారిటీ వ‌స్తుంద‌ని చెప్పింది. అయినా ఎన్డీయే ఓడిపోయి యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దాన్నే ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు సహా ఇంకా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. 2004 నాటి ఫ‌లితాలే 20 ఏండ్ల త‌ర్వాత 2024లోనూ పున‌రావృతం కాబోతున్నాయి. ఆ చ‌రిత్ర పున‌రావృతం కాబోతున్న‌దంటున్నారు. ఏడు దశలలో 64.2 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన తీర్పు ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినట్టు మోడీ 3.0 ప్రభుత్వ ఏర్పాటు ఖాయమేనా? ఇండియా కూటమి నేతలు చెబుతున్నట్టు 295 సీట్లు వస్తాయా? ఇట్లా పార్టీల అంచనాలు ఎలా ఉన్నా ఓటర్లే అంతిమ విజేతలు అన్నది వాస్తవం.