విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ పిస్టల్ బుల్లెట్ దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలైంది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఆమె ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. మహిళల
25 మీటర్ల పిస్టల్ విభాగంలో 50పాయింట్లకుగాను 43 పాయింట్ల సాధించి అద్భుతమైన
ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ఈషా సింగ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో కిమ్‌ యెజి (42 పాయింట్లు-కొరియా) రికార్డును ఆమె బద్దలు కొట్టింది. టోర్నీలో భారత్‌కు ఈషా తొలి పతకం అందించింది.

మాజీ ప్రపంచ ఛాంపియన్‌ డొరీన్‌ వెన్‌కాంప్‌ (జర్మనీ) రజతం, మిరోస్లోవా (బల్గేరియా) కాంస్యం గెలిచారు. అంతకుముందు ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్లో ఇషా 294, ప్రిసిషన్‌ రౌండ్లో 293 స్కోర్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది. స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ 582తో 12వ స్థానానికి పరిమితమై, ఫైనల్‌ చేరలేకపోయింది. గురువారం 10 మీటర్ల రైఫిల్‌ పోటీలో ఇలవేణిల్‌ వలరివాన్, ఆర్య బోర్సే, సాక్షి పడేకర్‌ బరిలోకి దిగనున్నారు.