రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. ఆర్మీ వ్యక్తి టికెట్ లేని ప్రయాణం

- టీటీఈతో వాగ్వాదం.. కాల్పులు
- ఎవరికీ గాయాలు కాకపోవడంతో
- ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
విధాత: న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)తో వాగ్వాదానికి దిగిన ఆర్మీలో పనిచేసే వ్యక్తి కాల్పులకు దిగిగాడని, ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని తూర్పు రైల్వే వెల్లడించింది. దాంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ధన్‌బాద్ నుంచి యూపీ సీల్దా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బీ-8 కోచ్‌లో కోల్‌కత్తాకు చెందిన హర్విందర్ సింగ్ అనే 41 ఏండ్ల ఆర్మీలో పనిచేసే వ్యక్తి ఎక్కాడు. టికెట్ విషయంలో టీటీఈతో వాగ్వాదానికి దిగిన అతడు.. కాల్పులు జరిపినట్టు తూర్పు రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. హర్విందర్ సింగ్ హౌరా – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు టికెట్ తీసుకున్నాడు.
కానీ, సీల్దా – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్టు వెల్లడించింది. రైలులోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. హర్విందర్‌సింగ్‌ను కోడెర్మా స్టేషన్‌లో రైలు నుంచి దింపి స్థానిక పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులందరూ సరైన టిక్కెట్‌తో మాత్రమే ఏదైనా రైలు ఎక్కాలని తూర్పు రైల్వే విజ్ఞప్తి చేసింది.