Lion Missing| సింహం కనబడటం లేదు..మీకేమైనా తెలుసా!
తమిళనాడు లోని వండలూర్ పార్క్ నుంచి ఓ మగ సింహం అదృశ్యమైంది. రెండు రోజులుగా అధికారుల సఫారీ పార్క్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నా..సింహం జాడ మాత్రం తెలియలేదు.

విధాత : సింహం కనబడటం(Lion Missing) లేదు..మీకేమైనా దాని జాడ తెలుసా అంటున్నారు సఫారీ పార్క్ అధికారులు. సింహం అదృశ్యం వ్యవహారం వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..తమిళనాడు(Tamil Nadu) లోని వండలూర్ పార్క్(Vandalur Safari Park) నుంచి ఓ మగ సింహం అదృశ్యమైంది. దీనిని ఇటీవలే గుజరాత్ నుంచి ఈ పార్కుకు తీసుకొచ్చారు. నేషనల్ యానిమల్ ఎక్స్‌ఛేంజి ప్రోగ్రామం కింద.. జునాగఢ్‌లోని చక్కర్‌బాగ్ పార్క్ నుంచి ఈ సింహాన్ని ఇక్కడికి తరలించారు. గత వారమే ఈ కొత్త సింహాన్ని బోను నుంచి సఫారీలోకి వదిలిన తర్వాత అది తిరిగి రాలేదు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సింహం జాడ కోసం పార్క్ అంతా గాలింపు చేపట్టారు. రెండు రోజులుగా అధికారుల సఫారీ పార్క్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నా..సింహం జాడ మాత్రం తెలియలేదు.
ఆగ్నేయాసియాలోని అతిపెద్ద జూలాజికల్ పార్కులలో ఒకటైన వండలూర్ పార్క్(అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్) చెన్నైకి సమీపంలో దాదాపు 1500 ఎకరాల్లో విస్తరించింది. వండలూర్ జూగా ప్రసిద్ధి చెందిన ఇక్కడ 200జాతులకు చెందిన 2400 పైగా పక్షులు, జంతువులు ఉన్నాయి. వీటిల్లో సింహాలు, ఎలుగుబంట్లు, పులులు, ఏనుగులు, జిరాఫీలు, జింకలు, దున్నపోతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వండలూరు పార్కుతో ఇతర ప్రాంతాల పార్కులకు మధ్య తరుచూ జంతువుల మార్పిడి జరుగుతుంటుంది. రెండెళ్ల క్రితం కరోనా నేపథ్యంలో మూడు సింహాలు మృతి చెందిన సందర్భంలోనూ బెంగుళూరు పార్క్ నుంచి మగ సింహం ఒక దానిని వండలూరు పార్కుకు తీసుకొచ్చారు.