మానవ అక్రమ రవాణా మాఫియాపై.. ఎన్ఐఏ మూకుమ్మడి దాడులు

మానవ అక్రమ రవాణా మాఫియాపై.. ఎన్ఐఏ మూకుమ్మడి దాడులు

విధాత: మానవ అక్రమ రవాణా మాఫియా వలయంపై నమోదైన కేసులో ఎన్ఐఏ పెద్దఎత్తున సోదాలు చేపట్టింది. ఒకవైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, మరోవైపు మానవ అక్రమ రవాణా మాఫియా చురుగ్గా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో నిమగ్నమై వుండటంతో ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఈ క్రమంలో దేశం నలుమూలలా దాడుల పరంపరను చేపట్టింది.


ఈ సోదాలతో దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తింది. ఎన్ఐఏ దాడులు మూకుమ్మడిగా మానవ అక్రమ రవాణాదారులు, దళారుల ఇండ్లపైన జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దేశంలోని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నలుమూలలా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలువురు అనుమానితుల ఇళ్లల్లో దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.


తెలంగాణ, తమిళనాడు, కేరళ, త్రిపుర, పుదుచ్చేరిలో సోదాలు ముమ్మరం చేశారు. అస్సాం, బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో కూడా తనిఖీలు, సోదాలు పెద్దఎత్తున చేపట్టారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియా గ్యాంగుల గురించి స్పష్టమైన సమాచారం ఎన్ఐఏ అధికారులు రహస్యంగా సేకరించారు. వాటి ఆధారంగా ఎన్ఐఏ పెద్దఎత్తున దేశంలోని అనేక రాష్ట్రాల్లో తమ దాడులను కేంద్రీకరించి సోదాలు చేస్తున్నది. కాగా ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడించేందుకు అధికారులు సిద్ధంగా లేరు.