ఆ గ్రామంలో ఒకటే కుటుంబం.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పిలీ గ్రామం
మేల్ఘాట్ అటవీ ప్రాంతంలో ఒకే ఒక కుటుంబంతో పిలీ గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. గతంలో ఆ గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివసించేవి

మహారాష్ట్ర : మేల్ఘాట్ అటవీ ప్రాంతంలో ఒకే ఒక కుటుంబంతో పిలీ గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. గతంలో ఆ గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివసించేవి. రెండు దశాబ్దాల క్రితం మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 37 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని గుర్తించారు. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పటికే 17 గ్రామాలను తరలించగా మరో ఆరు గ్రామాల తరలింపు జరుగుతోంది. ఈ క్రమంలోనే పిలీ అనే గ్రామంలోని సుమారు 500 కుటుంబాలు 2021లో ఖాళీ చేసి వెళ్లిపోయాయి. బలవంతంగా ఖాళీ చేయించాలని నిబంధన లేనందున అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.
అయితే ప్రభుత్వ నోటీసులతో అందరూ వెళ్లిపోగా భోగిలాల్ కుటుంబం మాత్రం పిలీ గ్రామంలోనే నివసిస్తోంది. అతనితో పాటు భార్య నలుగురు పిల్లలు కలిపి మొత్తం ఆరుగురు ఈ గ్రామంలోనే ఉంటున్నారు. ‘నాకు ఇక్కడ 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద ఇల్లు ఉంది. ఎనిమిది ఆవులు, పది-పదిహేను కోళ్లు ఉన్నాయి. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను. నా పెద్ద కుమారుడికి వివాహం కూడా జరిగింది. అతడు భార్యతో కలిపి ఇక్కడే ఉంటున్నాడు. మరో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వారిని నేనే బైక్ పై తీసుకెళ్లి సమీప గ్రామంలోని పాఠశాలలో దించేసి వస్తాను. నా వ్యవసాయ భూమికి, ఇల్లుకి, సమానమైన ధర చెలిస్తే ఇక్కడి నుంచి వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం కేవలం పది లక్షలు ఇస్తుంది, ఆ డబ్బుతో నేను ఏం చేసుకోవాలి? అని భోగి లాల్ భాయిట్ కర్ ప్రశ్నిస్తున్నారు.